మున్సిపల్ కార్మికుల డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో నేటి తెల్లవారుజామునుండే మున్సిపల్ కార్మికులు విధులకు హాజరయ్యారు. కాగా పలు డిమాండ్ల సాధనలో భాగంగా మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి దిగిన విషయం తెలిసిందే. దాంతో మున్సిపల్ కార్మికులతో చర్చలు జరిపేందుకు జగన్ ప్రభుత్వం మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. కార్మిక సంఘాలకు మంత్రి వర్గ ఉపసంఘంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో మున్సిపల్ కార్మికులు యథావిధిగా విధులకు హాజరయ్యారు.
మున్సిపల్ కార్మికుల డిమాండ్ల మేరకు వారికి జీతం రూ.15 వేలతో పాటు హెల్త్ అలవెన్స్ రూ.6 వేలు ఒకే సారి చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంతేకాకుండా సంక్రాంతికి కొత్త బట్టలు కొనుక్కోవడానికి ప్రతీ కార్మికునికి వెయ్యి రూపాయలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. సమ్మె కాలానికి జీతాలు చెల్లించడంతో పాటు వారిపై ఉన్న కేసులను కూడా ఎత్తివేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయాలపై కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేసాయి .
అంతేకాకుండా ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మికులు కుటుంబాలకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం నష్టపరిహారం ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం, ఈ పరిహారాన్ని అయిదు నుంచి ఏడు లక్షలకు పెంచింది. గతంలో మరణించిన అనగా 2019 నుంచి దరఖాస్తు చేసుకోని మృతుల కుటుంబాలు ఇప్పుడు దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పించింది. కాగా ప్రభుత్వం తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించడంతో మున్సిపల్ కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. సమ్మె విరమించిన కార్మికులు నేటి ఉదయం నుండే విధులకు ఆనందంగా హాజరయ్యారు.