తెలుగుదేశానికి లబ్ధి చేకూరుతుందంటే ఈనాడు ఎంతకైనా దిగజారుతుంది. జరగని వాటిని, అనని వాటిని తనే సృష్టించి కథలు అల్లుతుంది. ఆ కోణంలోనే సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తి విషయంలో ఇష్టానుసారంగా రాసి అభాసుపాలైంది. ఏకంగా జడ్జి ఆ పత్రిక కథనాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
గ్రానైట్ ఫ్యాక్టరీల తనిఖీకి వెళ్లిన అధికారులపై పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, ఆయన అనుచరులు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఎమ్మెల్యే హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని జడ్జి మల్లికార్జునరావు విచారించారు. ఈయన విషయంలో పచ్చ పత్రిక అనుచితంగా ప్రవర్తించింది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల జడ్జి ‘మీరు పోలీసులేనా.. అరెస్ట్ చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడితే సామాన్యుల పరిస్థితి ఏంటి?’ అన్నట్లుగా ఈనాడు రాసింది. ఈ విషయాన్ని విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంరెడ్డి నాగిరెడ్డి, ఏపీపీ దుష్యంత్‌రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మీరు అన్నారంటూ ప్రచురించిన కథనాల వల్ల పోలీసుల్లో మనోథైర్యం దెబ్బతినే అవకాశం ఉందని చెప్పారు. మొత్తం విన్న న్యాయమూర్తి మల్లికార్జునరావు వాళ్లు సర్యులేషన్ కోసం ఏమైనా రాస్తారంటూ ఘాటుగా అన్నారు. పత్రికలు చదవడమే మానేశానని, వాళ్లేం రాసారో పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెబితేనే తెలిసిందని కోర్టులో వ్యాఖ్యానించారు. ఏదో యధాలాపంగా మాట్లాడితే.. పరువు నష్టం కలిగించే విధంగా రాశారు. గతంలో నాకు వ్యతిరేకంగా కథనాలు వచ్చాయి. నేను పట్టించుకోలేదు. ఏమైనా అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు. దీనిని ఊహించని ఎమ్మెల్యే తరఫు న్యాయవాది ఎల్లో మీడియాను వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. పత్రిక వారితో మాట్లాడానని ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు అలా రాశారని కవర్ చేసే ప్రయత్నం చేశారు.
ఇలా ఇష్టానుసారంగా రాయడం ఈనాడుకు కొత్తేం కాదు. తమకు నచ్చని వారిపై బురద వేసేందుకు జడ్జిల పేరుతో దారుణమైన వ్యాఖ్యలు చేస్తుంది. దీంతో గతంలో కోర్టులు చీవాట్లు పెట్టిన సందర్భాలున్నాయి. అయినా తన తీరు మార్చుకోలేదు. సాక్షాత్తు హైకోర్టు జడ్జి విషయంలోనే ఈనాడు ఇలా వ్యవహరిస్తే ఇక కింది కోర్టుల్లో ఉండే వారి విషయంలో ఇంకెంత దారుణంగా రాస్తోందో.. ఎంతమంది అమయాకులను బలి చేస్తోందో..