కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వాలంటీర్ల కిడ్నాప్ సంఘటన కలకలం రేపుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరిగిన ఈ సంఘటన ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని అల్లకల్లోలం చేసేసింది. స్థానిక ప్రజలను భయభ్రాంతులను గురిచేసింది. అసలు వాలంటీర్లపై ఎందుకు ఇంత కక్ష? ఇదంతా ఎవరు చేయించారు? ఎవరి కనుసన్నల్లో ఇంత దారుణానికి ఒడిగట్టారు? లాంటి అనేక ప్రశ్నలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను హీటెక్కిస్తున్నాయి.
విషయంలోకి వెళ్తే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఆరుగురు వాలంటీర్ల కిడ్నాప్ జరిగింది. గత నాలుగున్నర సంవత్సరాలుగా జగన్ గారి ప్రభుత్వంలో వాలంటరీగా పని చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వాలంటరీ వ్యవస్థ ప్రభుత్వ కార్యకలాపాలకు, సంక్షేమ కార్యక్రమాలు అమలుకు దూరంగా ఉండాలని ఈసీ ఇచ్చినటువంటి ఉత్తర్వులతో వాలంటీర్లు అందరూ తమ విధులకు దూరంగా ఉన్నారు. కొంతమంది పూర్తిగా విధులకు దూరమై ఇళ్లకు పరిమితమైతే మరి కొంతమంది వారికి ఉన్న అవకాశాలను బట్టి తాత్కాలిక ఉపాధిని కల్పించుకునే ప్రయత్నంలో వివిధ సంస్థల్లో పని చేస్తున్నారు.
ఆ క్రమంలోనే ఈ ఆరుగురిలో ఒకరైనటువంటి వాలంటీర్ తన పుట్టినరోజు వేడుకను అలాగే ఆమె స్నేహితురాలు గర్భంతో ఉండడంతో పరామర్శించాలనేటువంటి ఆలోచనతోనూ తన మిత్రులను తను పనిచేసే ఆఫీస్ కి ఆహ్వానించింది. అయితే అక్కడేదో వాలంటీర్లు అందరూ కలిసి మీటింగ్ పెట్టారు అనే అపోహతో కాకినాడ రూరల్ నియోజకవర్గం కూటమి అభ్యర్థి జనసేన పార్టీ నేత పంతులు నానాజీ అనుచరులు అక్కడికి చేరుకుని వారిని దుర్భాషలు ఆడడమే కాకుండా వారితో అసభ్యంగా ప్రవర్తించారు. వాలంటీర్లు ఎంత చెప్పినా వినకుండా వారిపై చేయి చేసుకున్నారు. అనంతరం గదికి తాళం వేసి గదిలో నిర్బంధించి వెళ్లిపోయారు.
దీంతో భయభ్రాంతులకు గురైన వాలంటీర్లు పోలీస్ వారికి కాల్ చేయగా వారు వచ్చి ఆ నిర్బంధo నుండి విడిపించి జరిగిన విషయాన్ని తెలుసుకుని వాలంటీర్ల ఫిర్యాదు మేరకు పంతం నానాజీ అనుచరులపై కేసు నమోదు చేశారు. కొన్ని రోజుల క్రితం కూడా పంతంగి అనుచరులు వాలంటీర్లపై దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అసలు వాలంటీర్లకి ఇంత భయపడుతున్న వ్యక్తి రేపు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎలా నెగ్గుకు రాగలడు అంటూ ముక్కున వేసుకుంటున్నారు కాకినాడ రూరల్ ప్రజలు. ఒకపక్క చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థ పై ఫిర్యాదు చేయించి కోర్టులో కేసులు వేసి వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేస్తే ఇంకా వాలంటీర్లపై ఇలాంటి దురాగతాలకు ఒడికట్టడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావట్లేదని వాలంటీర్లు వాపోతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో బయటకు వెళ్లాలంటేనే భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.