ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ప్రజలను బెంబేలిత్తుస్తున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వేడిగాలులు వీస్తుండడంతో పాటు ఉక్కపోత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ముఖ్యంగా ఏపీలో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు, విజయవాడ, అనంతపురం, నెల్లూరు, తిరుపతిలోనూ 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం గమనార్హం. కర్నూలు 42, తిరుపతి 41, నెల్లూరు, విజయవాడలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా విశాఖ జిల్లాలో ఎండలు ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరుకున్నాయి. 2016 తర్వాత ఈ ఏడాదే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణలో 12 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. సూర్యాపేట జిల్లాలో నేడు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లాలోని పెన్పహాడ్లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో, నల్గొండ జిల్లాలోని నాంపల్లిలో 44.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్, ములుగు జిల్లాలోని మేడారం, కుమురంభీం జిల్లాలోని పెంచికల్ పేట, మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ, భద్రాద్రి జిల్లా అశ్వాపురం, దమ్మపేటలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ, ఖమ్మం, మంచిర్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండంలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ లో 40 డిగ్రీలు, హైదరాబాద్ లో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో బయటకు రావొద్దని ముఖ్యమైన పనులుంటే ఉదయం, సాయంత్రం వేళల్లో చూసుకోవాలని ఒకవేళ మధ్యాహ్నం వేళలో బయటకు వస్తే మంచి నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తాగాలని సూచించారు. డీహైడ్రేషన్ సమస్య తలెత్తకుండా తరుచూ మంచి నీరు తాగాలని అధికారులు సూచిస్తున్నారు.