ముందునుండి ఊహిస్తున్నట్లుగానే విజయవాడ ఎంపీ కేశినేని నానికి టీడీపీ సీట్ ఇచ్చేది లేదని మొండి చెయ్యి చూపింది. ఈ మేరకు స్వయంగా కేశినేని నాని సామాజిక మాధ్యమం ద్వారా స్పష్టతనిచ్చారు. రాబోయే ఎన్నికలో తన స్థానంలో విజయవాడ లోక్ సభ అభ్యర్థిగా వేరేవారికి అవకాశం ఇచ్చేందుకు గాను ఇకపై పార్టీ వ్యవహారలో తనను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు గారు ఆదేశించారని కేశినేని నాని తెలియజేసారు.
కాగా కేశినేని నానికి టికెట్ నిరాకరించిన విషయంలో టీడీపీ కేడర్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2019లో జగన్ గాలిలో కూడా గెలిచిన కేశినేని నానికి ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ కొందరు టీడీపీ కార్యకర్తలు మండిపడుతుండగా మరికొందరేమో ఇండిపెండెంట్ గా పోటీ చేయమని సలహా ఇస్తున్నారు. గత కొంతకాలంగా కేశినేని నానికి బదులుగా కేశినేని చిన్నికి విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో గతంలో ఎంపీ నాని కూడా టికెట్ మార్పు విషయంలో ఘాటుగా స్పందించారు. అవసరం అయితే ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేస్తానని ఆయన పలు సందర్భాల్లో ఆయన వెల్లడించడం సంచలనంగా మారింది.
ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఈ నెల 7న టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరు రానున్న సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే గద్దె రాంమోహన్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, టీడీపీ నేత నాగుల్మీరాలతో కలిసి కేశినేని నాని ఏర్పాట్ల పరిశీలనకు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ప్లెక్సీలలో ఎంపీ నాని ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగడంతో కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దాంతో ఇరువర్గాలు చేతికందిన వస్తువులతో బాహాబాహీకి దిగడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసారు. అయినా ఇరు వర్గాలు వెనక్కి తగ్గలేదు. పైగా పోలీసులపైకి దాడులకు దిగారు. దాంతో ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు.
చంద్రబాబు టికెట్ నిరాకరించిన నేపథ్యంలో అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసావహిస్తానని ఎంపీ కేశినేని నాని చెప్పినప్పటికీ, టికెట్ నిరాకరిస్తే తిరుగుబాటు బావుటా ఎగరవేస్తానని గతంలో నాని ప్రకటించిన నేపథ్యంలో ఆయన పార్టీకి విధేయుడిగా ఉంటూ సైలెంట్ అవుతారా లేక ఇతర పార్టీల వైపు చూస్తారా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇతర పార్టీల వైపు చూడకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా అనే అనుమానాలు కూడా రాజకీయ వర్గాలలో వ్యక్తమవుతున్నాయి. విజయవాడ టీడీపీ రాజకీయం రాబోయే ఎన్నికల లోగా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.