2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూటమి మేనిఫెస్టోని విడుదల చేసింది. కూటమిలో భాగంగా బీజేపీ టీడీపీ జనసేనలు భాగమైన విషయం అందరికీ తెలిసిందే, కానీ మేనిఫెస్టోలో మాత్రం బీజేపీకి సంబంధం లేదు అంటూ ఆ పార్టీ నేతలు ప్రకటన చేశారు. అమలు గాని హామీలు చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టడంతో అవి అమలు పరచకపోతే బీజేపీకి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని భావించి మొదట్లోనే తప్పుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు.
ఒక చిన్న విశ్లేషణ చూద్దాం, చంద్రబాబు తన మేనిఫెస్టోలో అగ్రవర్ణాలకు తప్ప మిగిలిన అన్ని కులాల వారిలో 50 సంవత్సరాలు పైబడిన వారికి ఫించన్ ఇస్తానని ప్రకటించాడు.. పథకం వినడానికి బాగానే ఉన్నా అమలుపైన సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతానికి రాష్ట్రంలో పెన్షన్ తీసుకునేవారు 66 లక్షల పైగా ఉన్నారు, వీరికి తోడుగా 50 సంవత్సరాలు పైగా ఉన్నవారు 80 లక్షలకు పైగా ఉన్నారు, సరాసరి ఇద్దరిని కలిపితే 1 కోటి 50 లక్షల మంది అవుతారు. చంద్రబాబు చెప్పినట్లు నెలకి 4000 రూపాయలు పెన్షన్ వేసుకుంటే అలా 1.5 కోట్ల మందికి నెలకు 6 వేల కోట్లు అవుతుంది. ఏడాదికి 72 వేల కోట్లు అవుతుంది. రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం పైన ఒక పెన్షన్ పైనే కేటాయిస్తున్నారు. గతంలో 1999-2004 చంద్రబాబు హయాంలో నెలకు 75 రూపాయిలు పెన్షన్ ఉండేది. ఊరికి 10 మందికి మించి ఇచ్చే వారు కాదు. ఆ పదిమందిలో ఒకరు చనిపోతే గాని మిగిలిన అర్హత జాబితాలో ఉన్నవారికి ఇచ్చేవారు కాదు. గతంలో 75 రూపాయలు పెన్షన్ అర్హులైన వారికే ఇవ్వడానికి ఇబ్బంది పడిన చంద్రబాబు ఇప్పుడు ఇంతమందికి ఇస్తారంటే నమ్మడానికి ప్రజల ఎవరు సిద్ధంగా లేరు.
19 సంవత్సరాలు దాటిన మహిళలకు ప్రతినెల 1500 కానుక ఇస్తా అన్నాడు చంద్రబాబు . ఈ లెక్కన 18 సంవత్సరాలు దాటిన వారు రెండు కోట్ల మందికి పైగా ఉన్నారు. నెలకు 1500 రూపాయలు అంటే రెండు కోట్ల మందికి నెలకు 3000 కోట్లు , సంవత్సరానికి 36000 కోట్లు కావాలి . ఇలా రెండు పథకాలకి ఏడాదికి 1,10,000 కోట్లు ఖర్చు చేస్తే ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక, వెనుజ్యులా అవ్వదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.