ఎన్నికల్లో గెలిచేందుకు తెలుగుదేశం అడ్డదారులు తొక్కుతూనే ఉంది. ఓటర్లను ప్రలోభ పెడుతున్న సంఘటనలు రోజూ ఏదో ఒక ప్రాంతంలో బయట పడుతూనే ఉన్నాయి. మహిళలకు చీరలు, పురుషులకు మద్యం బాటిళ్లను విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. ఎల్లో మీడియా దృష్టిలో ఇది ప్రజా సేవగా కనిపిస్తోందేమో.. తమకేం పట్టనట్లుగా ఉంది.
టీడీపీ నంద్యాల ఎంపీ టికెట్ ఆశిస్తున్న బైరెడ్డి శబరి మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుమార్తె అయిన ఈమె ఇటీవల భారతీయ జనతా పార్టీ నుంచి టీడీపీలో చేరారు. గతంలో కమలం పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారు. జీవించినంత కాలం అందులోనే ఉంటానని చెప్పి చంద్రబాబు నాయుడి చేత కండువా కప్పించుకున్నారు. కానీ తండ్రి మాత్రం చేరలేదని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా బీజేపీతో పొత్తు నేపథ్యంలో టీడీపీకి ముస్లింలు దూరమయ్యారు. దీంతో ఆ ఓటర్లకు రాజశేఖరరెడ్డి, శబరి టీమ్ గాలం వేస్తూ దొరికిపోయారు. నందికొట్కూరులో రంజాన్ తోఫా పేరుతో చీరల పంపిణీకి తెరలేపారు. ఈ విషయం బయట పడడంతో తమకేమీ తెలియదని బుకాయిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం చిత్తూరు జిల్లాలో ఓ తెలుగు తమ్ముడి గోదాములో పంపిణీకి సిద్ధంగా ఉన్న కుక్కర్లను పట్టుకున్న విషయం తెలిసిందే.
అధిష్టానం ఆదేశాలతో టీడీపీ అభ్యర్థులు మహిళా ఓటర్లకు పంచేందుకు చిన్నచిన్న గృహోపకరణాలు, చీరలను సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. అలాగే నగదును నిల్వ చేసుకున్నట్లు సమాచారం. తమకు ప్రజా బలం ఉందని ఓ వైపు చంద్రబాబు సభల్లో చెబుతుంటారు. గెలుపుపై నమ్మకమే ఉంటే ఈ ప్రలోభాలపర్వం ఏమిటో ఆయనే చెప్పాలి.