వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వీపీఆర్) చంద్రబాబు నాయుడి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే ఈ కార్యక్రమంలో ఆయన వర్గీయులకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి.
తన వెంట టీడీపీ శ్రేణులు భారీగా నడుస్తాయని వీపీఆర్ భావించారు. చంద్రబాబు వస్తున్నాడు కాబట్టి మాజీ మంత్రులు పొంగూరు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ మేయర్ అజీజ్, సీనియర్లు బీద రవిచంద్ర, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తదితరులు తమ మనుషులతో పెద్ద ఎత్తున తరలివస్తారని భావిస్తే హ్యాండ్ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి కొంతమంది చోటా నాయకులు తప్ప ముఖ్యమైన లీడర్లు ఎవరూ టీడీపీలో చేరేందుకు సుముఖత చూపించలేదు. ఇతర పార్టీల నుంచి వస్తారనుకుంటే ఎవరూ ముఖం కూడా చూపించలేదు. దీంతో తనకు చాలా పెద్ద వర్గముందని బాబు ముందు చూపించుకుందామని భావించిన వీపీఆర్ ఆశలు నీరుగారిపోయాయి. అంతా ఆయనే చూసుకుంటాడులే అని వివిధ నియోజకవర్గాల నుంచి టీడీపీ ముఖ్య నేతలు చుట్టపు చూపుగా అతి తక్కువ మందితో వచ్చారు. జనసేన శ్రేణులైతే ఈ కార్యక్రమాన్ని పట్టించుకోలేదు. కొందరు నాయకులు మాత్రం వెళ్లి మమ అనిపించారు.
వాస్తవానికి భారీ బహిరంగ పెట్టి టీడీపీలో చేరాలని వీపీఆర్ భావించారు. అయితే ఆయనకంటూ వర్గం లేదు. మాస్ లీడర్ కూడా కాదు. పైగా రాష్ట్రంలో ఎక్కడ చంద్రబాబు సభలు జరిగినా జనం నుంచి స్పందన ఉండడం లేదు. దీంతో సభ ఫెయిలైతే ఎన్నికలపై ప్రభావం పడుతుందని భయపడి తన కన్వెన్షన్ సెంటర్లోనే కార్యక్రమం పెట్టుకున్నారు. జనాన్ని తరలించే బాధ్యతను తన వెంట తిరుగుతున్న రూప్‌కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి అప్పగించారు.
సందు దొరికింది కదా అని టీడీపీ రూరల్ అభ్యర్థి శ్రీధర్‌రెడ్డి రెచ్చిపోయారు. వీపీఆర్ వద్ద మార్కులు కొట్టేసి ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టిచేద్దామని నాయకుల్ని బతిమిలాడి తరలించారు. ఇక్కడే సమస్య మొదలైంది. శ్రీధర్‌రెడ్డి ఆదేశాలతో ఆయన మనుషులు కన్వెన్షన్ సెంటర్లో నానా హంగామా చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలను ఆపి, తమ వారికే పెద్దపీట వేసేందుకు ప్రయత్నించారు. రూప్‌కుమార్ యాదవ్ వర్గానికి చెందిన ముస్లిం నాయకుడు ఒకరు కొందరిని వెంటేసుకుని రాగా ఆపేశారు. దీంతో శ్రీధర్‌రెడ్డి మనుషులు, వారి మధ్య తోపులాట జరిగింది. కాసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నేతలు జోక్యం చేసుకుని సర్దిచెప్పాల్సి వచ్చింది.
శ్రీధర్‌రెడ్డి, రూప్‌కుమార్ యాదవ్‌లు వీపీఆర్కి అంతా మేమే.. ఆయనకు మేము ఎంత చెబితే అంతని చూపించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్దిరోజులుగా ఆయన్ను వదలకుండా తిరుగుతున్నారు. సభలో పైచేయి కోసం ఇరువర్గాల వారు అనేక వేషాలు వేశారు. డబ్బులిచ్చి కొందరిని తెచ్చుకుని పోటాపోటీ ర్యాలీలు చేశారు. కాగా తన మనుషులనే ఆపేయడంతో రూప్‌కుమార్ మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. మొదటి రోజే పలువురి నుంచి ఫిర్యాదులు రావడంతో వేమిరెడ్డి ఇదెక్కడి ఖర్మ అంటూ తలపట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడే ఏమైంది. రానున్న రోజుల్లో టీడీపీలో ఇలాంటివి చాలా చూడాల్సి వస్తుంది.