మైలవరంలో గెలుపు కోసం టీడీపీ అభ్యర్ధి వసంత కృష్ణ ప్రసాద్ దౌర్జన్యాలకు దిగుతున్నారు. ప్రచారంలో ముస్లిం వర్గీయులపై అందులో మహిళలపై దాడులకు తెగబడి గాయపరిచారు. ఇప్పటికే మీడియా ప్రతినిధులను, సొంత టీడీపీ పార్టీ కార్యకర్తలను వ్రాయలేని భాషలో తిట్టిన విషయం దాని మీద నియోజకవర్గంలో గొడవలు అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా వసంత కృష్ణప్రసాద్ తరుపున తన సతీమణి శిరీష కొండపల్లిలో 20వ వార్డు లో ప్రచారం చేస్తుండగా స్థానిక కౌన్సిలర్ భర్త అయిన ఫణి తమ ప్రాంతంలోకి అడుగు పెట్టవద్దు అంటూ లోకల్ ప్రజలు, ముస్లిం వర్గాలు పెద్ద ఎత్తున అడ్డుకున్నారు.
మైనారిటీ వర్గాలకు చెందిన షాదీఖానాకు సంబంధించిన భూమిని కబ్జా చేసిన ఫణి అతని అనుచరులు రావద్దని గొడవ చేశారు. దీనితో రెచ్చిపోయిన ఫణి, టీడీపీ కార్యకర్తలు ముస్లింల మీద దాడులు చేసి అడ్డువచ్చిన ముస్లిం మహిళల మీద కూడా దాడి చేసి గాయపరిచారు. ఇదంతా తన సమక్షంలో జరుగుతున్నా, దాడి చేసే వారిని వారించకుండా, గాయాల పాలైన ముస్లింలను పట్టించుకోకుండా వసంత శిరీష వెళ్ళిపోయారు. ఈ సంఘటనలతో మైలవరం ముస్లిం పెద్దలు టీడీపీ మీద గుర్రుగా ఉన్నారు. మీకు అండగా నిలబడిన మా భూములను కబ్జా చెయ్యడమే కాకుండా తిరిగి మా మీద దాడులు చేస్తారా అంటూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.
పార్టీ మారిన వసంత కృష్ణ ప్రసాద్ వెంట వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున వస్తారు అనుకుంటే ఎవరు రాకపోవడం, అదే సమయంలో టీడీపీలోని ఉమా అనుచరులు, బొమ్మసాని వర్గీయులు తనకు సహకరించక పోవడంతో , వసంత కృష్ణప్రసాద్ కోపంతో సొంత పార్టీ వారినే ప్రచారంలో తిడుతూ శాపనార్థాలు పెడుతున్నారు . ఈ సమయంలో వైసీపీ ఆతి సామాన్య కార్యకర్తను పోటీలో దించి నియోజకవర్గ నాయకులంతా కలిసి కట్టుగా ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు. వసంత కృష్ణప్రసాద్ ఏమో డబ్బున్న పొగరుతో ఎవరిని లెక్క చెయ్యక పోవడంతో కార్యకర్తల నుంచే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.
ఇప్పుడు ముస్లిం ప్రజల మీద దాడి జిల్లా టీడీపీ నాయకులను కలవరపెడుతున్నది . ఈ విషయం చిలికి చిలికి తమ నియోజకవర్గానికి చుట్టుకుంటుందేమోనని కలవరపడుతున్నారు. ఈ గొడవను పార్టీ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.