వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తెలుగుదేశంలో చేరకముందే ఆ పార్టీలో విభేదాలు, అలకలు మొదలయ్యాయి. పెద్దన్న పాత్ర కోసం నాయకులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అసలే నెల్లూరు జిల్లాలో పార్టీ చాలా బలహీనంగా ఉంది. ఎన్నికల సమయంలో నేతల తీరు కారణంగా ప్రజల్లో ఇంకా చులకన అయిపోతుందని కార్యకర్తలు మదనపడుతున్నారు. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలు అధినేత చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా మారాయి. ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతోందని ఆందోళన చెందుతున్నారు.
ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చాలాకాలం జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. మరొకరిని ఎదగనివ్వలేదు. 2014లో విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్యేగా గెలవకపోయినా చంద్రబాబు కేబినెట్లో స్థానం సంపాదించారు. అత్యంత కీలకమైన మున్సిపల్ శాఖ మంత్రి పదవి చేపట్టారు. ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఆయన చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. అదే సమయంలో సోమిరెడ్డి సర్వేపల్లిలో ఓడిపోయారు. పార్టీ పవర్లో ఉందిలే తన మాట చెల్లుబాటు అవుతుందని భావించారు. అయితే లోకేశ్ అండదండలతో నారాయణ రెచ్చిపోయారు. పార్టీ, ప్రభుత్వంలో తన పరపతి పెంచుకున్నారు. జిల్లాలో తెలుగు తమ్ముళ్లకు పెద్ద దిక్కు పోస్టును లాగేసుకున్నారు. దీంతో సోమిరెడ్డి పరిస్థితి దారుణంగా మారింది. ఆయన్ను ఎవరూ పట్టించుకోలేదు. గత వైభవాన్ని తలుచుకుంటూ కొంతకాలం సైలెంట్‌గా ఉండిపోయారు.
రెండోసారి మంత్రివర్గ విస్తరణ సమయంలో సోమిరెడ్డి చక్రం తిప్పారు. బాబుతో ఉన్న వ్యాపార సంబంధాలను అడ్డం పెట్టుకుని వ్యవసాయ శాఖ మినిస్టర్ అయ్యారు. మళ్లీ జిల్లాలో పార్టీపై పెత్తనం చెలాయించడం మొదలు పెట్టారు. నారాయణ, సోమిరెడ్డి వర్గాలుగా నేతలు విడిపోయారు. ఇద్దరు బడా నాయకులు పైకి నవ్వుకుంటూనే మాట్లాడినా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. సోమిరెడ్డి వల్లే జిల్లాలో టీడీపీ నాశనమైందని నారాయణ చాలాసార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. నారాయణకు జన బలం లేదని, ఆయనకు సిటీ టికెట్ ఇవ్వొద్దని సోమిరెడ్డి తన మనుషుల చేత ప్రచారం చేయించారు. 2019లో ఉమ్మడి జిల్లాలో పదికి పది స్థానాల్లో తెలుగుదేశం ఓడిపోయింది. నారాయణ రాజకీయాలు వదిలేసి తన వ్యాపారాలపై దృష్టి పెట్టారు. సోమిరెడ్డి మళ్లీ పెద్దన్న పాత్ర తీసుకుని అంతా నాదేనన్నట్లుగా ప్రవర్తిస్తూ వచ్చారు.
24 ఎన్నికలకు ఆరునెలల సమయం ఉందనగా నారాయణ రీ ఎంట్రీ ఇచ్చారు. దీంతో సోమిరెడ్డికి మళ్లీ కష్టకాలం మొదలైంది. ఈసారి నారాయణ ఒక మెట్టు పైన ఉండాలని వ్యూహాలకు పదును పెట్టారు. వరుసగా ఓడిపోయిన వారికి టికెట్ లేదని లోకేశ్ చేత చెప్పించారు. దీంతో సోమిరెడ్డి రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారింది. చంద్రబాబు కూడా మాట వినే పరిస్థితి కనిపించలేదు. పార్టీకి ఆర్థిక స్తంభం కావడంతో అన్ని చోట్లా నారాయణ మాట నెగ్గడం మొదలైంది.
పెద్దన్న పాత్ర పోతే పోయింది ముందు సర్వేపల్లి టికెట్ వస్తే చాలని చివరికి సోమిరెడ్డి భావించారు. బాబు, లోకేశ్ దృష్టిలో పడేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వల్ల అదానీ కృష్ణపట్నం పోర్టు నుంచి కంటైనర్ టెర్మినల్ వెళ్లిపోతోందని అబద్ధాలు ప్రచారం చేశారు. అయితే అలాంటిదేమీ ఇటీవల తేలిపోయింది. జిల్లా కోర్టులో ఫైళ్ల దొంగతనాన్ని తన రాజకీయ ప్రత్యర్థి, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి అంటగట్టాలని చూశారు. ఈ విషయం టీడీపీకి మైలేజ్ ఇస్తుందని అధిష్టానానికి చెప్పారు. అయితే సీబీఐ విచారణ చేసి మంత్రి పాత్ర లేదని తేల్చడంతో టీడీపీలో సోమిరెడ్డి పరువు పోయింది. దీంతో ఈయన రిటైర్మెంట్ టైమ్ వచ్చేసిందని, ఇప్పుడంతా నారాయణ హవా నడుస్తోందని కింది స్థాయి నేతలంతా అటు వెళ్లిపోయారు. జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులను తిట్టినా సోమిరెడ్డికి ఉపయోగం లేకుండా పోయింది. రాజకీయాల నుంచి నిష్క్రమించాల్సిన సమయం వచ్చేందని భయపడిపోయారు.
వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వీపీఆర్) తన భార్య ప్రశాంతిరెడ్డికి నెల్లూరు సిటీ టికెట్ ఇవ్వలేదని, సామాన్య ముస్లిం వ్యక్తిని సమన్వయకర్తను చేశారని వైఎస్సార్సీపీపై అలిగారు. దీనిని తన రాజకీయ ఎదుగుదలకు ఉపయోగించుకుకోవచ్చు.. అలాగే నారాయణకు చెక్ పెట్టొచ్చని సోమిరెడ్డి భావించారు. పైగా వేమిరెడ్డి సమీప బంధువు కావడం ఆయనకు కలిసొచ్చింది. నెల్లూరు పార్లమెంట్ సీట్ ఇప్పిస్తానని చెప్పారు. బాబు ఎన్డీఏలో చేరుతున్నారు కాబట్టి కేంద్ర సహాయ మంత్రి వస్తుందని, భార్యకు కోవూరు టికెట్ ఇస్తామని గేలం వేశారు. టీడీపీ అధినేత వద్ద మార్కులు కొట్టేసి, సర్వేపల్లి సీటు తీసుకుందాం, నారాయణను కిందకు లాగేద్దామని భావించిన సోమిరెడ్డి ప్లాన్ ఫలించింది. కేంద్ర మంత్రి పదవి వస్తుందనే ఆశకు వీపీఆర్ లొంగిపోయారు. బాగా డబ్బున్న పెత్తందారు కావడంతో చంద్రబాబు కూడా వెంటనే ఒప్పుకొన్నారు.
వీపీఆర్ వైఎస్సార్సీపీకి రాజీనామా చేయడం.. టీడీపీలో చేరేందుకు సిద్ధం కావడంతో సోమిరెడ్డి ఇక తనకు రాజకీయంగా, టికెట్ పరంగా, ఆర్థికంగా దిగుల్లేదని సంబరపడిపోతున్నారు. అదే సమయంలో నారాయణ మాత్రం ఢీలా పడిపోయారు. దీనికి కారణం లేకపోలేదు. సోమిరెడ్డి తరపతిని ఉపయోగించి టీడీపీ నేతల్ని వీపీఆర్ వద్దకు పంపుతున్నారు. ఆయన డబ్బుకు ఆశపడి చాలామంది వెళ్లి ఇక మీరే పెద్ద దిక్కని చెబుతున్నారు. అందులోనూ ఎంపీ సీటు ఆయనదే కావడంతో ఇతర నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులు ఖర్చులకు నగదు వస్తుందని వీపీఆర్ వద్దకు పరిగెత్తుతున్నారు. సోమిరెడ్డి పనైపోయింది.. ఇక జిల్లాలో తెలుగుదేశానికి నేనే పెద్ద దిక్కనుకున్న నారాయణ పరిస్థితి రోజుల వ్యవధిలోనే తారుమారైంది. పైగా సిటీలో తన వెంట తిరుగుతున్న వారు కూడా సోమిరెడ్డి ప్రలోభాలకు లొంగి వేమిరెడ్డిని కలుస్తున్నారు.
చంద్రబాబు, లోకేశ్.. వీపీఆర్కే అధిక ప్రాధాన్యం ఇస్తారని ఇప్పుడు నారాయణ భయపడుతున్నారు. బాబుకు వెన్నుపోటు పొడవడం వెన్నతో పెట్టి విద్యని చరిత్ర కూడా చెబుతోంది. అందుకే వేమిరెడ్డికి దూరంగా ఉండాలని తన మనుషులకు చెప్పినట్లు తెలిసింది. పైగా తాను కేవలం సిటీ అభ్యర్థి కావడంతో మిగిలిన నియోజకవర్గాల నేతలు పట్టించుకోరని విద్యాసంస్థల అధినేత బాధపడిపోతున్నారు. రాజకీయంగా తొక్కేయాలని చూసిన నారాయణపై సోమిరెడ్డి ఈ విధంగా పైచేయి సాధించారు. బంధుత్వం ఉండటంతో వీపీఆర్ సోమిరెడ్డి మాటలే వినే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నారాయణను పట్టించుకోరు. పైగా పెద్దన్న పాత్ర వస్తుందంటే కాదనే పరిస్థితి లేదు. ఇక నుంచి నెల్లూరు జిల్లా టీడీపీ రాజకీయాలు నారాయణ వర్సెస్ వేమిరెడ్డిగా జరగనున్నాయి. నాకు కావాల్సినవి దక్కితే చాల్లే అని సోమిరెడ్డి ఒక పక్కగా చేరి వేడుక చూస్తూ ఉంటారు. పార్టీ బలహీనమైపోతుంది.