‘నా డబ్బు కోట్ల రూపాయలు తినేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఎవరూ పని చేయడం లేదు’ తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ బాధ ఇది. ఇటీవల టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. 2019లో అనిల్ చేతిలో ఓటమి తర్వాత విద్యాSవ్యాపారం చేసుకునేందుకు నారాయణ హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ఎన్నికలకు ఆరునెలల ముందు రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. అప్పటికే పనిచేస్తున్న కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని కాదని చంద్రబాబు నారాయణకే సిటీ సీటును ప్రకటించారు.
నారాయణ టీడీపీ నేతల్ని కాదని ఎన్ టీమ్ అని కొందరికి జీతాలిచ్చి పెట్టుకుని వారిని వార్డుల్లో తిప్పుతున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లు అలిగి సహాయ నిరాకరణ చేయడంతో మెట్టు దిగక తప్పలేదు. సీనియర్ల కోరిక మేరకు కొందరు యువతీయువకుల్ని భారీ జీతాలతో ఎన్ టీమ్‌లోకి తీసుకున్నారు. పలువురు చోటా నేతల్ని నారాయణ తన వెంట పెట్టుకున్నారు. ఎన్ టీమ్ వార్డుల్లో అక్కడి నాయకుల సహకారంతో పనిచేయాలని చెప్పారు. ఈ క్రమంలో భారీగా ఖర్చు పెట్టి కార్యాలయాలు తెరిచారు. రోజూ ఎన్ టీమ్, నేతలు ప్రజల వద్దకు వెళ్లి కలవాలి. ఎప్పటికప్పుడు రిపోర్టును నారాయణ ప్రధాన కార్యాలయం పెద్దలకు పంపాలి. కానీ చాలాచోట్ల అలా జరగడం లేదని తెలిసింది.
కొద్దిరోజుల క్రితం సీనియర్ నాయకుడు ఒకరు తాను పెట్టిన ఎన్ టీమ్ సభ్యులు ఇద్దరికి జీతం ఇంకా రాలేదని నారాయణ కార్యాలయానికి వెళ్లి అడిగారు. దీంతో అక్కడి ఇన్చార్జి అగ్గిమీద గుగ్గిలమయ్యారు. వాళ్లు పనిచేయడం లేదని, లోకల్‌గా ఉండే ఆఫీస్‌కు కాసేపు వెళ్తున్నారని ఆగ్రహించారు. ఈ ఎన్నికలు నారాయణకు చాలా కీలకమని, ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా గెలుస్తాడని ప్రశ్నించారు. అయితే సదరు నాయకుడు జీతం ఇవ్వాల్సిందేనని పట్టుబడ్డారు. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఓ సమయంలో మీ వల్లే పార్టీ నాశనమైందని సీనియర్‌ను అవమానకరంగా మాట్లాడే సరికి ఆయన నారాయణ వద్దే విషయం తేల్చుకుంటాని వచ్చేశారు. కానీ వారి నుంచి స్పందన శూన్యం.
తన మనుషుల నుంచి విషయాలు తెలుసుకున్న నారాయణ రెండు రోజుల క్రితం ఎన్ టీమ్, వార్డుల నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సీనియర్ల కోరిక మేరకు పెట్టుకున్న టీమ్ సభ్యులు కొందరు పనిచేయడం లేదని కోపంగా మాట్లాడారు. టీడీపీ నేతలు ఇంతేనని, డబ్బు కోసమే తన చుట్టూ తిరుగుతున్నారనే ధోరణి ప్రదర్శించారు. ఓటర్లను ఎందుకు కలవడం లేదని తిట్టారు. ఇంతింత జీతాలిచ్చి పెట్టుకుందని ఎందుకని.. ఊరకనే కార్యాలయంలో కూర్చొంటే ఎలా గెలుస్తానని గద్దించారు. నేతలంతా కలిసి నా డబ్బుని తినేస్తున్నారని అరిచారు. ఈ విషయంపై నాయకులు గుర్రుగా ఉన్నారు. నారాయణ వ్యవహారశైలి నచ్చక దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
డబ్బు వెదజల్లి గెలిచేద్దామని భావించిన నారాయణకు తత్వం బోధ పడింది. లెక్క ఉంటే సరిపోదని, నమ్మకమైన మనుషులు ఉండాలని అర్థమైంది.