ఆంధ్రప్రదేశ్ లో మే 13న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దాంతో ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్ని ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా బస్సు యాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ప్రజలు సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలో పలువురు నేతలు టీడీపీ నుండి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. తాజాగా సీఎం జగన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత వైసీపీలో చేరారు.
గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత వైయస్ఆర్ సీపీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా అమ్మగారిపల్లె స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో టీడీపీ నేత ఏ.హరికృష్ణ వైయస్ఆర్ సీపీలో చేరారు. సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి హరికృష్ణను పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ మంత్రి కుతూహలమ్మ కుమారుడైన హరికృష్ణ 2019లో టీడీపీ తరఫున గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి పాల్గొన్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు రసవత్తరంగా కొనసాగనున్నాయి. త్వరలో జరగబోయే ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమితో హోరాహోరీగా తలపడనుంది. సీఎం జగన్ తన సంక్షేమ పథకాలే తన పార్టీని గెలిపిస్తాయని నమ్ముతూ ఎన్నికల బరిలో ఒంటరిగా పోటీకి దిగుతుండగా మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశ్యంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమను గెలిపిస్తుందని కూటమి బలంగా విశ్వసిస్తుంది.