తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సీట్ల పంపకం ఇంకా తేలలేదు. వైఎస్సార్సీపీ ఇప్పటికే మూడు జాబితాలు ఇచ్చి చాలాచోట్ల అభ్యర్థులెవరో తేల్చి ఎన్నికల రేస్‌లో ముందుంది. అయితే ఆ రెండు పార్టీలు మాత్రం పొత్తు పెట్టుకున్న నాటి నుంచి సీట్ల కేటాయింపు విషయంలో పాట్లు పడుతూనే ఉన్నాయి. తొలిజాబితా ఇవ్వడానికే అష్టకష్టాలు పడుతున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఆయన దత్తపుత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వైఎస్సార్సీపీని ఓడించాలని,వైఎస్ జగన్మోహన్రెడ్డిని దెబ్బ కొట్టాలని కుట్రలకు తెరలేపారు. 2014 సంవత్సరం నుంచి వారిద్దరూ ఇదే లక్ష్యంతో కలిసి పనిచేస్తున్నారు. 2019 ఎన్నికల్లో బాబు జనసేనకు వేరే పార్టీలతో పొత్తులు కుదిర్చి తాను ఒంటరిగా బరిలోకి దిగాడు. అయితే అందరూ జగన్ సునామీలో కొట్టుకుపోయారు. 2024 ఎన్నికల్లో కలిసే బరిలోకి దిగాలని నిర్ణయించి మళ్లీ పొత్తు పెట్టుకున్నా కానీ సీట్ల విషయంలో మోసగాడైన బాబు మార్కు రాజకీయం నడుస్తోంది. పవన్‌కు అన్ని తెలిసినా ప్యాకేజీ కోసం బాబు చెప్పింది వింటున్నాడనే అభిప్రాయం పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది.
ఎవరికెన్ని?
సీట్ల పంపకాల్లో టీడీపీ, జనసేనల మధ్య ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. 70 నుంచి 75 మందితో కూడిన తొలి జాబితాను ఈ వారంలో ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇరు పార్టీల మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్పటికే బాబు, పవన్ పలుమార్లు కలిసి మాట్లాడారు. కొద్దిరోజుల క్రితం డిన్నర్ భేటీ కూడా జరిగింది. సీట్ల విషయంలో జనసైనికుల నుంచి పవన్‌పై ఒత్తిడి అధికంగా ఉంది. ఎక్కువ స్థానాలు అడగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీ నాయకులు టీడీపీ ఇన్చార్జిలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ మేమే అభ్యర్థులం అంటూ బహిరంగంగా చెప్పుకొంటున్నారు. అయితే చంద్రబాబు తన తెలివిని ప్రదర్శిస్తూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
దీంతో తొలిజాబితాపై ఇంకా స్పష్టత లేదు. అందులో తమకు 60, జనసేనకు పది సీట్లు ఉంటాయని టీడీపీ పెద్దలు చెబుతున్నారు. అయితే సేన నేతలు టీడీపీకి 50, తమకు 20 ఇవ్వాలని అడుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదటి నుంచి పవన్ పార్టీకి కుల పార్టీగా ముద్ర ఉంది. ఈ నేపథ్యంలో బాబు దానిని ఉపయోగించుకునేందుకు ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మిగిలిన ప్రాంతాల్లో అరకొరగా సీట్లు ఇచ్చి మొత్తంగా 25లోపు సర్దేయాలని ఆయన భావనగా చెబుతున్నారు. సేనకు అసలు చాలాచోట్ల బలం లేదని, ఇందుకు ఉదాహరణగా తెలంగాణ ఎన్నికల ఫలితాలను టీడీపీ చూపిస్తున్నట్లు తెలిసింది.
సంకట స్థితిలో పవన్
పవన్ కళ్యాణ్ సంకట స్థితిలో ఉన్నారు. జనసైనికుల సలహాలు పరిగణలోకి తీసుకోకపోతే ఎన్నికల్లో వారి మద్దతు ఉండదని ఆయన భయం. ఈ నేపథ్యంలో కొన్ని సీట్ల విషయంలో ఆయన పట్టు వీడటంలేదని సమాచారం. ప్రధానంగా పార్లమెంట్ సీట్లు ప్రతిపాదన కంటే ఎక్కువగానే అడుగుతున్నారు. జగన్ వల్ల సామాన్యులు ఎంపీలుగా ఎన్నికయ్యారు. వారిలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఒకరు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఎంపీగా గురుమూర్తి గెలిచారు. వీరిని చూపించి ఎక్కువ సీట్లను జనసేన డిమాండ్ చేస్తోంది. అయితే బాబు మాత్రం ఎంపీ టికెట్లకు రేటు పెట్టి అమ్మే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో అడిగినన్ని ఇచ్చేది లేదని తెలుగుదేశం అంటోంది. కొందరు టీడీపీ నాయకులను జనసేనలోకి పంపి వారికి టికెట్లు ఇవ్వాలని బాబు చూస్తున్నారు. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా నుంచి జలీల్‌ఖాన్ పవన్‌ను కలిశారు. ఇలా జరిగితే సేనకు ఇచ్చే సీట్ల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది.
చేగొండి మాట చెల్లుతుందా?
కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య కొంతకాలంగా పవన్‌కు లేఖల ద్వారా సలహాలు ఇస్తున్నారు. ఈయన దృష్టిలో తెలుగుదేశం బలహీనంగా ఉంది. జనసేన చాలా బలంగా ఉంది. అందుకే 60 సీట్లకు తగ్గకుండా పోటీ చేయాలని పవన్‌కు చెప్పారు. ఆయన, బాబు చెరి రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా ఉండాలనంటున్నారు. ఇలా చెప్పి ఎన్నిలకు వెళ్తేనే ప్రయోజనం ఉంటుందని, లేకపోతే 2019 ఫలితాలే రిపీట్ అవుతాయని అభిప్రాయపడ్డారు. కానీ చేగొండి మాటలు ఎంత వరకు పవన్ వింటారనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇందుకు అనేక కారణాలున్నాయి. జనసేనాని ఒక్కో సభలో ఒక్కోలా మాట్లాడుతుంటారు. ఒకసారి తనను సీఎం చేయండి అంటారు. మరోసారి నాకు ఏ పదవులు వద్దంటూ తన పార్టీ కార్యకర్తలను అయోమయంలో పడేస్తుంటారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నారా లోకేశ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాము గెలిస్తే పవర్ షేరింగ్ ఉండదని, బాబే ముఖ్యమంత్రి అవుతారని కుండబద్ధలు కొట్టారు. ఇందుకు పవన్ అంగీకారం ఉందన్నట్లుగా ఆయన సమాధానమిచ్చారు. దీంతో పవన్ సీఎం కావాలని కోరుకుంటున్న జనసైనికుల ఆశలపై నీళ్లు చల్లారు. లోకేశ్ మాటలతో పొత్తులో ఎవరి బలం ఎంతో తేలిపోయింది. టీడీపీ చెప్పింది జనసేన వినాల్సిందేనని అందరికీ అర్థమైపోయింది. మొత్తంగా అభ్యర్థుల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన పవన్ పార్టీ నేతల్ని బాధ పెడుతోంది. పొత్తు ధర్మం అంటే ఇదేనా అని వారు ప్రశ్నిస్తున్నారు.