‘తెలుగుదేశం పార్టీలో చేరిన ఎన్డీఏ.. కమలం పెద్దలు కాళ్లు పట్టుకుని బతిమిలాడడంతో పాత విషయాలను పక్కనబెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు ఒప్పుకోవాల్సి వచ్చింది. కొద్దిరోజులుగా నారా వారి అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు ఎట్టకేలకు కరకట్ట నివాసంలో దర్శనభాగ్యం కలిగింది. దీంతో వారు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ భేటీలో నాకు బుద్ధి పుట్టిన చోట సీట్లు ఇస్తాను.. పోటీ చేసి ఎదగిపోండని విశాల హృదయంతో బాబు చెప్పడంతో వాళ్లిద్దరూ మహాప్రసాదమని ఎగిరి గంతేసినంత పని చేశారు. ఏ హోటల్లో దిగారని అడిగి.. నాలుగు వీధుల అవతల మన వెంకాయమ్మ వేసే దోసెలు బాగుంటాయి. తినేసి జాగ్రత్తగా హస్తినకు పోండంటూ 40 ఇయర్స్ ఇండస్ట్రి సలహా ఇచ్చారు’ ఇలా కల కంటూ ఉన్న తెలుగు తమ్ముడి ముఖాన ఎవరో నీళ్లు కొట్టడంతో ఉలిక్కి పడి లేచాడు. ఇలా జరిగితే ఎంత బాగుంటుందో అనుకున్నాడు. అతను రాత్రి త్వరగానే నిద్రపోయాడు. దీంతో బాబు ఢిల్లీ పర్యటన ఏమైందోనని తెలుసుకునేందుకు గబాగబా సోషల్ మీడియా తెరిచాడు.
అంతే తమ్ముడికి కరెంట్ షాక్ కొట్టినంత పనైంది. అంతపెద్ద ప్రపంచ మేధావి చంద్రబాబు, ఆయన వెంట నడుస్తున్న రెండు లక్షల పుస్తకాలు చదివిన మరో మేధావి పవన్ కళ్యాణ్‌కు షా ఇంకా అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలుసుకుని కళ్లు ఎర్రబడిపోయాయి. కొన్ని సెకన్లకే కన్నీళ్లు నాలుగు చుక్కలు కారాయి. భగవంతుడా ఎంత పనిచేశావు.. మా నాయకులపై నీకు కనికరం లేదా.. అంటూ ఆకాశం వైపు చూసి మనసులో అనుకున్నాడు.
సోషల్ మీడియా కాదు.. పచ్చ పత్రికలు తిరగేస్తే ఎనర్జీ వస్తుందని ఓపెన్ చేశాడు. ‘మనమంతా ఒకే జట్టు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దాం. బీజేపీ, జనసేన, టీడీపీ సంయుక్త నిర్ణయం. కమలం, సేన పార్టీలకు కలిపి 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలు.. నేడు ప్రకటించే అవకాశం’ అని ఈనాడు రాసింది. ఇది చూడగానే తమ్ముడి ముఖం వెలిగిపోయింది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆంధ్రజ్యోతి ఈ పేపర్లోకి వెళ్లాడు. ‘నేడే పొత్తు పొడుపు.. టీడీపీ – జనసేన – బీజేపీ దోస్తీపై అధికారిక ప్రకటన.. సీట్ల సంఖ్యపై ఐదు నిమిషాల్లోనే ఖరారు.. ఎంపీ స్థానాలు తమకు కీలకమన్న షా.. గౌరవప్రద సంఖ్యలో కేటాయించాలని కోరిన బీజేపీ.. 23 సీట్లలో గెలుపు ఖాయమని అంచనా..’ అంటూ రాసుకొచ్చింది.
తమ్ముడు రెండు స్టెప్స్ వేసి వెంటనే ఫేస్బుక్ ఓపెన్ చేసి ‘ఇక బాబు గారు ఆడించే ఆట చూస్తారుగా.. జగన్.. నీ పనైపోయింది..’ వాల్ మీద పోస్ట్ చేశాడు. కాపీ చేసి ట్విట్టర్లో కూడా పెట్టాడు. వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. పది, పదిహేను గ్రూపుల్లో తోసేశాడు. బలంగా ఊపిరి తీసుకుని.. టీ షాపునకు వెళ్లాడు. గాజు గ్లాస్లో ఇస్తే.. మాస్టర్‌ను తిట్టి ప్లాస్టిక్ కప్పులో ఇవ్వవయ్యా. నాకు ఎంగిలి గ్లాస్ వద్దని కసురుకున్నాడు. కామెంట్లు, లైక్‌లు చూసుకునే పనిలో పడ్డాడు.
హస్తినలో చంద్రబాబు, పవన్ ఎదురెదురుగా కూర్చొని ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. షా అపాయింట్మెంట్ ఓకే అయిందనే ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ల నుంచి కన్ఫర్మేషన్ వస్తే.. టీడీపీలో చేరిన ఎన్డీఏ అని ఎలివేషన్లు ఇచ్చేందుకు ఎల్లో మీడియా పెద్దలు, తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు అటూఇటూ తిరుగుతున్నారు.