‘తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తుల గురించి చర్చించలేదు. మా సమావేశంలో దాని ప్రస్తావనే రాలేదు’ కమలం హైమాండ్‌కు చెందిన నేతలు స్పష్టం చేశారు. దీంతో ఆ పార్టీలో ఉన్న తెలుగు తమ్ముళ్లకు షాక్ కొట్టినంత పనైంది. అధిష్టానం ఆదేశాలతో జీ రెండు రోజులుగా అభ్యర్థుల ఎంపికపై పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో సమీక్షిస్తున్నారు. తొలిరోజు 14, రెండో రోజు 11 నియోజకవర్గాల నేతలతో ఆయన సమావేశాలు నిర్వహించారు. ఇప్పటికే ప్రతి అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ముగ్గురేసి చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసినట్లు సమాచారం.
పొత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న చంద్రబాబు నాయుడికి బీజేపీ హైకమాండ్ ఝలక్ ఇచ్చింది. అసలు పొత్తుల ప్రస్తావన రాలేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ ప్రకటించారు. అలాగే 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో పోటీపై కసరత్తులు జరుగుతున్నాయని చెప్పడంతో టీడీపీ నేతల వెంట నోటి మాట కరువైంది. మరోవైపు పొత్తు కుదిర్చేందుకు చంద్రబాబు మనుషులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. శివన్నారాయణ వ్యాఖ్యలకు భిన్నంగా వారు మాట్లాడారు. పొత్తులు కోరుకుంటున్నట్లు సమావేశంలో చెప్పామని, ఈ విషయమై చర్చించామని సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి, విష్ణుకుమార్‌రాజు ప్రకటించారు. టీడీపీ, జనసేనతో కూటమి కట్టి 2014లో గెలిచామని, 2024లో మరోసారి పొత్తులో వెళ్తామన్న విష్ణుకుమార్ మాటల వెనుక పచ్చ మనుషులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
సమావేశంలో పొత్తులపై చర్చించలేదని, మరోసారి ఒంటరిగా పోటీకి వెళ్లే అవకాశముందని బీజేపీ హైకమాండ్ నుంచి వచ్చిన వారు కుండబద్ధలు కొట్టినా బాబు మనుషులు వేరేలా మాట్లాడటంతో అవాక్కవడం కాషాయ కార్యకర్తల వంతైంది. నారా వారి వల్లే తమ పార్టీ ఎదగలేదని వారు ఆగ్రహంగా ఉన్నారు. బలపడేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ఫిబ్రవరిలో బాబు ఢిల్లీకి వెళ్లి అమిత్‌షా, జేపీ నడ్డాను కలిస్తే ఇంత వరకు పొత్తుపై క్లారిటీ లేదు. వారి నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తుందనే ఆశతో టీడీపీ 57 సీట్లను ప్రకటించకుండా ఆపి పెట్టిన విషయం తెలిసిందే.. ఓ వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. కానీ వెంటనే ఆగిపోమన్నారు. ఎల్లో నేతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఏదో ఒక విషయం తేల్చండి మహాప్రభో అంటూ హస్తిన వైపు తిరిగి దండాలు పెడుతున్నారు.