పొత్తు విషయంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఇంకా క్లారిటీ లేదు. ప్రకటించిన సీట్లపై ఆగ్రహ జ్వాలలు చల్లారలేదు. రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలోనూ తెలుగుదేశం – జనసేన నేతలు, కార్యకర్తల మధ్య సఖ్యత లేదు. ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదో ఒకటి చేయకపోతే ప్రజలు పట్టించుకోరనే భయంతో కూటమి తొలి ఉమ్మడి సభను తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు వద్ద బుధవారం నిర్వహిస్తున్నారు. దీనికి ఇరు పార్టీల పేరు కలిసొచ్చేలా తెలుగు జన జెండా అంటూ పేరు పెట్టారు. అసలు సొంత అజెండా అనే పేరు సరిపోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సభ నిర్వహణ వెనుక చాలా కారణాలున్నాయి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు మొదటి నుంచి ప్రజలకు మంచి చేస్తామని చెప్పడం లేదు. నిద్ర లేచింది మొదలు తిరిగి పడుకునే వరకు వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. పవన్ వారాహి యాత్రను ఆపేసి చాలా కాలమైంది. కేవలం నాయకులతో సమావేశాలకే పరిమితమయ్యారు. బాబు రా కదలి రా, ఆయన తనయుడు లోకేశ్ శంఖారావం పేర్లతో సభలు నిర్వహిస్తున్నారు. వీటిని రెండు పార్టీల నేతలే లైట్ తీసుకున్నారు. అరకొరగా వచ్చిన వారి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. సేన నేతల్ని తెలుగు తమ్ముళ్లు చావ బాదుతున్నారు. ఇంకోవైపు సీఎం జగన్ సిద్ధం సభలతో దూసుకెళ్తున్నారు. దీంతో దిక్కుచోచని స్థితిలో ఈ ఉమ్మడి సభకు శ్రీకారం చుట్టారు.
వీరి స్థాయి ఇంతే..
కూటమి సభ కేవలం 22 ఎకరాల్లోనే జరుగుతోంది. అది కూడా వేదిక, హెలిప్యాడ్, వీవీఐపీల రెస్ట్ రూముల కోసం ఏడు ఎకరాలు కేటాయించారు. మిగిలిన 15 ఎకరాల్లో 22 గ్యాలరీలు పెట్టారు. మొత్తం 33 వేల కుర్చీల పడతాయి. ఒకవేళ ఇంకొంతమంది వస్తారనుకున్నా 50 వేల లోపే ఉంటుంది. కానీ భారీ సభ అంటూ ఎల్లో గ్యాంగ్ ఊదరగొడుతోంది. ఎన్నికల సభలంటే ఇలా ఉండాలని జగన్ కొత్త నిర్వచనం ఇస్తున్నారు. తొలి భీమిలి సిద్ధం సభకు 4 లక్షల మందిపైనే వచ్చి ఉంటారని అంచనా. రెండో దెందులూరు సభను 110 ఎకరాల్లో నిర్వహించగా సుమారు ఏడు లక్షల మంది తరలివచ్చారు. ఒక మూడో రాప్తాడు సభ 250 ఎకరాల్లో జరగ్గా సుమారు 11 లక్షల మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. అయితే తొలి కూటమి సభకు లక్ష మంది లోపు కూడా వచ్చే అవకాశం లేదు. నాయకులు, కార్యకర్తలను బతిమిలాడి వాహనాల్లో తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. కూటమి సభపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు సెటైర్లు వేస్తున్నారు. మా సిద్ధం సభలో వాహనాల పార్కింగ్ కోసమే 30 ఎకరాలపైనే కేటాయించారని చెబుతున్నారు.
పేరుకి తెలుగు జన జెండా అని పెట్టారు కానీ.. అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి చేస్తారో ఇరు పార్టీల అధినేతలు చెప్పేది చాలా తక్కువే. తమ సొంత అజెండాలో భాగంగా జగన్‌ను తిట్టడానికే ఈ సభను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ‘జగన్ నీ అంతు చూస్తాం.. నీ పనైపోయింది.. నిన్ను భూస్థాపితం చేస్తాం.. జైల్లో వేయిస్తాం..’ అంటూ ఇప్పటికే చంద్రబాబు, పవన్, లోకేశ్‌లు చాలాసార్లు చెప్పేశారు. కాకపోతే ఈసారి సినిమా రైటర్లను పెట్టుకుని కొత్త డైలాగ్‌లు రాయించుకుని ఉండొచ్చు. ఈరోజు సీఎం రైతులకు పెట్టుబడి సాయం, సున్నా వడ్డీ పంట రుణాలు ఇస్తున్నారని కాబట్టి జనంలో దీనిపై చర్చ జరగకుండా తిట్ల డోస్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. టికెట్ల విషయంలో రగడ ఆగడం లేదు కాబట్టి.. వేదికపై నుంచి శాంతించండి.. పవర్ చేతికి రాగానే న్యాయం చేస్తామని చెప్పే అవకాశముంది. క్రికెటర్ హనుమ విహారి, విశాఖ ఫ్లోటింగ్ బ్రిడ్జి తదితర సాకులతో సీట్ల అంశాన్ని విజయవంతంగా డైవర్ట్ చేస్తున్న ఎల్లో సోషల్ మీడియా ఈ సభను విపరీతంగా వాడుకుంటుంది. జనసైనికులు తమకు చాలా తక్కువ స్థానాలు ఇచ్చారని మర్చిపోవడానికి పవన్ ఊగిపోయి డైలాగ్‌లు చెప్పి వారికి ఖుషీ చేయొచ్చు. ఎలా చూసినా సభ సొంత అజెండాతోనే జరుగుతోందని స్పష్టంగా అర్థమవుతోంది.