ఈ మధ్య కాలంలో టీడీపీని వీడి వైసీపీలో చేరిన కేశినేని నాని పై చోటా మోటా టీడీపీ నేతలు మాటల దాడి మొదలుపెట్టారు. ఒకప్పుడు చంద్రబాబు పక్కన కూర్చున్న నానీ ఇపుడు వైసీపిలో చిన్నా చితకా నేతల వెనుక నిలబడాల్సి వస్తుందని అన్నారు.
వివరాలలోకి వెళితే… టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా అమరాతిలో ప్రెస్మీట్ నిర్వహించి కేశినేని నాని పార్టీ మారడాన్ని తప్పుబట్టారు. టీడీపీలో ఉన్నప్పుడు దేశద్రోహిగా, మోసగాడిగా కనిపించిన జగన్, ఇపుడు దేవుడిలా కనబడుతున్నాడా అంటూ ఎద్దేవా చేసారు. కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణంలో అతని పాత్ర శూన్యమని, అతనిపై టీడీపీ అభ్యర్థి రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తారని అన్నారు. అంతే కాక, కేశినేని నాని వైసీపీ కోవర్టు అని, పీఆర్పీ టీడిపీలానే వైసీపీ కూడా అతనిని భరించలేదని అంటూ తీవ్రమైన నిందలు వేసారు
అయితే, కేశినేనిని “కేరాఫ్ కోవర్ట్” అనడాన్ని గమనిస్తే… దశాబ్దాల కోసం పార్టీ కోసం పని చేసి, కేవలం నలుగురే యంపీలు గా ఎన్నికయినా… పార్టీని వీడకుండా పార్లమెంటులో టీడీపీ వాణి వినిపించడానికి పని చేసిన కేశినేని నాని ఏరకంగా కోవర్టో టీడీపీ వాళ్ళే చెప్పాలి. తనకు నచ్చని వారిని, అవసరం తీరిపోయిన వారిని ఎలా, ముందుగా వారి వల్ల పార్టీకి ఉపయోగం లేదని ముద్ర వేయించి, తరువాత పార్టీని వీడి వెళ్ళిపోయేలా చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. కేశినేని నానిని అవమానించి, పార్టీ కార్యకలాపాల నుంచి దూరంగా ఉంచి, తనంతట తానే బయటికి వెళ్ళిపోయే పరిస్థితులను నానికి కల్పించింది ఖచ్చితంగా చంద్రబాబే. ఈ విషయాలు తెలిసినా మాట్లాడలేని ఆ పార్టీ నాయకులు, అధికార ప్రతినిధులు కేశినేని నానిని కోవర్ట్ అంటూ సంబోధించడం చాలా విచారకరం.