ఏ ఎండకా గొడుగు అనేది పాత పద్ధతి. ఇప్పుడు ఏదైతే లైమ్‌లైట్‌లో ఉందో దాని చుట్టూ ఈగల్లా ముసరడం కొత్త పద్ధతి. ఒకప్పుడు యన్టీరామారావుని వెనుక నుంచి కౌగిలించుకుని, సీయం పదవిని ముందు నుంచి లాక్కున్న కొత్తల్లో… శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారు, మద్యంపై ఉక్కుపాదం మోపేస్తున్నా అని మెహర్బానీలు చాలా చులాగ్గా పలికేవారు.
అప్పటికి, మద్య నిషేధం అన్నది రామారావు చేసిన గొప్ప పనుల్లో ఒకటిగా అనిపించటం, ప్రజలు మరియు ముఖ్యంగా స్త్రీలు దానికి బ్రహ్మ రధం పట్టడంతో, బాబు గారికి లేస్తే మద్య నిషేధం, కూర్చుంటే మద్యంపై ఉక్కుపాదం అన్నట్టు ఉండేది. అందుకే, కుదిరినంత మేర.. ప్రజలు చుట్టూ ఉన్నప్పుడు మద్య నిషేధంపైనే ఎక్కువ మాటలుండేవి, పైరవీల పత్రికల్లో అవే హెడింగులుగా వచ్చేవి. జనానికి కూడా బాబుగారికీ మద్యానికీ బొత్తిగా పొసగదు అనే రేంజిలో అనిపించేది.
మద్య నిషేధం పటిష్ట అమలుపై ప్రత్యేక కోర్టులూ, చెక్‌పోస్టులూ, మద్య నిషేధానికి సహకరించని గ్రామాలకి సౌకర్యాలు బందూ అంటూ పేపర్లలో ఊదరగొట్టేవారు. కాలు గిర్రున తిరిగింది. ప్రజలకి కూడా రామారావు నుంచి బాబుపైకి గాలి మళ్ళింది. అంతకు ముందు వీరవాగ్ధానాలుగా చెలామణీ అయిన మద్య నిషేధం చర్యలన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలు అయ్యాయి. నెమ్మదిగా మద్య నిషేధం అనేది అటకెక్కి, జనానికి ముందు కిక్కెక్కడం మామూలైపోయింది.
అక్కరలేనివాటిని చాలా కన్వీనియంట్‌గా మర్చిపోయే బాబుగారు, గతంలో ఇచ్చిన స్టేట్మెంట్లన్నీ ఎప్పట్లానే మరిచిపోయారు. ఇపుడు కొత్త పాట, జగన్ ప్రభుత్వంలో క్వాలిటీ ముందు దొరకట్లేదనీ, ఒకప్పుడు మంచి బ్రాండ్లన్నీ ఆయన హయాంలోనే దొరికేవనీ, సాయంత్రం అయ్యేసరికి మందు బాబులకి పెళ్ళాం పిల్లలు కన్నా ముందు గుర్తొచ్చేది చంద్రబాబే అని ఒకటే గ్రామఫోను రికార్డు.
ఇంకొక అడుగు ముందుకేసి, మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే క్వాలిటీ ముందు కూడా ఇస్తానని ఆయన ప్రకటించేసారు. నిజంగా వెన్నుపోటు పొడవని, వెన్నెముక ఉన్న రాజకీయనాయకుడైతే… మళ్ళీ మద్యపాన నిషేధం తీసుకొస్తాం అని చెప్పాలి. అలా చెప్పాలంటే… మందుబాబుల ఓట్లు పడవనీ, మందు మీద వచ్చే నోట్లు రాలవనీ భయం. అవన్నీ మానేసి క్వాలిటీ మందు ఇస్తాం, మీకు కావాల్సిన బ్రాండ్స్ మద్యం ఇస్తాం, గట్టిగా ఉండే ప్లాస్టిక్ ఇస్తాం, సాయంత్రం అయితే రెండు పెగ్గులు వేసుకొంటే తప్పేంటి అంటూ చంద్రబాబు అందుకొన్న కొత్త పల్లవి ఆయనలోని అధికార దాహానికి, డొల్లతనానికి నిలువెత్తు నిదర్శనం!!!