‘వాళ్లంతా పేరుకి బీజేపీలో ఉన్నారు. నా కోసమే పనిచేస్తారు. ఇప్పుడు మీ జిల్లాల్లో మన పార్టీకి వాళ్లే లీడర్లు. ఏం చెప్పినా విని చేయాలంతే’ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఈ ధోరణిలో ముందుకెళ్తున్నారు. ఏపీలో కమలం పార్టీలో ఉంటూ తన కోసం పనిచేస్తున్న వారికి టీడీపీ బాధ్యతలు పూర్తిగా అప్పజెప్పేశారు. సదరు నేతలు బీజేపీని పట్టించుకోకుండా బాబు చెప్పినట్లు వింటూ తెలుగుదేశం కోసం పనిచేస్తున్నారు. ఆ పార్టీ అభ్యర్థులను ఎలాగైనా గెలిపించాలని ప్రయత్నిస్తున్నారు.
సీఎం రమేష్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. కడపకు చెందిన ఈ వ్యక్తి నారా వారి కోసం బీజేపీలోకి వెళ్లాడు. ఇప్పుడు ప్రతిఫలంగా అనకాపల్లి టికెట్ పొందాడు. ఆ పార్లమెంట్ పరిధిలో టీడీపీ వ్యవహారాలను చక్కబెట్టే పని రమేష్‌ది. నిత్యం తెలుగు తమ్ముళ్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీని లైట్ తీసుకున్నారు. సుజనా చౌదరి.. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన ఈ పెద్ద మనిషి ఒకప్పుడు టీడీపీలోనే ఉన్నాడు. బాబు ఆదేశాలతో బీజేపీలోకి దూకాడు. ఇప్పుడు సీనియర్ టీడీపీ, జనసేన నేతల్ని కాదని విజయవాడ పశ్చిమ అసెంబ్లీ సీటు కొట్టేశాడు. విజయవాడ పరిధిలో తెలుగు తమ్ముళ్లను సమన్వయం చేసే బాధ్యత సుజనాదే.
ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి. చంద్రబాబు భార్య భువనేశ్వరి సోదరి. పేరుకి ఈమె జాతీయ పార్టీకి ఇక్కడ అధ్యక్షురాలు అయ్యుండొచ్చు. కానీ బాబు సారథ్యంలోనే పనిచేసేందుకు ఇష్టపడతారు. రాజమండ్రి ఎంపీగా కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో టీడీపీ నేతలంతా ప్రస్తుతం ఈమె మాటే వినాలి. ఆ విధంగా నారా వారు ఆదేశిలిచ్చారు. ఇక ధర్మవరం అసెంబ్లీ అభ్యర్థి సత్యకుమార్. ఇక్కడ పరిటాల శ్రీరామ్‌ను కాదని అతనికి బాబు టికెట్ ఇచ్చాడంటే ఏ స్థాయిలో నమ్ముతున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీని సత్యకుమార్ చేతిలో పెట్టేశారు. ఈయనకు చెప్పకుండా తెలుగు తమ్ముళ్లు ఏమీ చేయడానికి లేదు. నాయకుల మధ్య విభేదాలుంటే పరిష్కరించే పని సత్యదే.
ఈ పరిణామాలను చూసి అటు కమలం పార్టీ కార్యర్తలు, ఇటు టీడీపీ కార్యకర్తలు ఆశ్చర్యపోతున్నారు. పైకి కాషాయ కండువా కప్పుకొన్నా చంద్రబాబు కోసం పనిచేస్తున్న ఈ గ్యాంగ్‌ను చూసి బీజేపీ సీనియర్ కార్యకర్తలు రగిలిపోతున్నారు. ఎక్కువ సీట్లు తీసుకోకుండా బాబు సేవలో తరిస్తూ పార్టీకి ద్రోహం చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. అదే సమయంలో దశాబ్దాలుగా టీడీపీ కోసం పనిచేస్తుంటే వేరే పార్టీ వారికి తమపై పెత్తనం ఇవ్వడం ఏమిటని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం ఊగిపోతున్నారు.