శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అభివృద్ధికి వేణుంబాక విజయసాయిరెడ్డి నడుం బిగించారు. ఈ పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న ఆయన ప్రత్యేక మేనిఫెస్టోను ప్రకటించారు. దీనిని మంగళవారం పలువురు అభ్యర్థులు, నేతలతో కలిసి విడుదల చేశారు. మొత్తం 46 హామీలిచ్చారు. తాము అధికారంలోకి వస్తే పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో ఏ పనులు చేస్తామో అందులో వివరించారు. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి చేపట్టే పనులను అందులో పొందుపరిచారు.
ముఖ్యంగా యువతకు మేలు చేసేలా విజయసాయిరెడ్డి మేనిఫెస్టో ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వెళ్లే అవసరం లేకుండా స్థానికంగానే యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు నెల్లూరులో టెక్ హబ్, స్టార్టప్ హబ్‌లు నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. లక్ష మంది ఐటీ నిపుణులకు ఉపాధి కల్పించేలా ఐటీ పార్కును నిర్మించాలన్నది లక్ష్యమని విజయసాయిరెడ్డి తెలిపారు. క్రీడలకు పెద్దపీట వేసేందుకు నెల్లూరు నగరం సమీపంలోని మొగళ్లపాళెం వద్ద 150 ఎకరాల్లో రూ.250 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తామన్నారు. వచ్చే ఐదేళ్లలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రొటేషన్ పద్ధతిలో ప్రతి ఆరునెలలకు ఒకసారి యువత కోసం జాబ్‌మేళాలు నిర్వహిస్తారు. ఒక్కో మేళా ద్వారా కనీసం 10 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బిట్రగుంట రైల్వే పరిధిలో 1,800 ఎకరాల విస్తీర్ణంలో మెగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని విజయసాయిరెడ్డి ప్రకటించారు. గ్రామాల్లో 1,000 మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కో యూనిట్లో 50 మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. చేపలు, రొయ్యలు ప్రాసెసింగ్ చేయడానికి వీలుగా హేచరీల సంఖ్యను 150కి పెంచడానికి చర్యలు తీసుకుంటారు. ఈ జిల్లాలో సుమారు 30 వేల హెక్టార్లలో వెదురు, యూకలిప్టస్ సాగు అవుతోంది. ఈ ఉత్పత్తులను ప్రాసెస్ చేసేందుకు 30 వుడ్ పల్ప్ కర్మాగారాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారు. ఇంకా మైనాడులో బీచ్ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తారు.