సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. ఎన్నికల్లో ఓడిపోవడం ఈ తెలుగుదేశం కురవృద్ధుడికి అలవాటే. చాలాకాలంగా పోటీ చేస్తున్నా గెలుపు తలుపు తట్టడం లేదు. ఈసారి సర్వేపల్లి టికెట్ విషయంలో తర్జనభర్జనలు జరిగాయి. అయితే సోమిరెడ్డి అలియాస్ అల్లీపురం రెడ్డి ఇవే చివరి ఎన్నికలని చంద్రబాబును బతిమిలాడుకుని సీటు సంపాదించారు. ఇప్పుడు ఓటమి భయంతో జిల్లాలో ముఖ్య నేతల గడపలు తొక్కుతూ తనకు మాట సాయం చేయాలని కోరుతున్నారు.
సోమిరెడ్డి 1994లో సర్వేపల్లి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1999లో గెలుపొందారు. 2001లో మంత్రి అయ్యారు. ఆ తర్వాత ఓటములు ఆయన్ను పలకరించాయి. 2014లో వైఎస్సార్సీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చేతిలో ఓడిపోయినా చంద్రబాబును బతిమిలాడుకుని ఎమ్మెల్సీ అయ్యారు. జిల్లాలో పొంగూరు నారాయణ ఆధిపత్యానికి గండి కొట్టడానికి మంత్రి పదవి తీసుకున్నారు. 19లో మళ్లీ కాకాణి చేతిలో ఘోర ఓటమిని చవి చూశారు. ఇంతటితో సోమిరెడ్డి రాజకీయ జీవితం ముగిసిందని అందరూ భావించారు. కానీ ఆయన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, కాకాణి, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ వచ్చారు.
24 ఎన్నికలు వచ్చే సరికి సోమిరెడ్డికి టికెట్ ఇచ్చేందుకు లోకేశ్ ఒప్పుకోలేదు. దీంతో తన కుమారుడు రాజగోపాల్‌రెడ్డికి ఇవ్వాలని అల్లీపురం రెడ్డి కోరారు. కానీ అతనికి ప్రజా బలం లేకపోవడంతో కుదరదన్నారు. చివరికి చంద్రబాబు వద్దకు వెళ్లి వ్యాపార సంబంధాలను ప్రస్తావించడంతో సోమిరెడ్డికే అవకాశం కల్పించారని ప్రచారం ఉంది. ఇక్కడే ఆయనకు అసలైన పరీక్ష మొదలైందవి. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి పనులు ఇంకా వెంటాడుతున్నాయి. దీంతో ఈసారి గెలుపుపై నమ్మకం లేదు. 2019లో మాదిరిగానే ఇప్పుడు కూడా తనకు ఇవే చివరి ఎన్నికలని, ఒక్క అవకాశం ఇవ్వాలని జనం చుట్టూ తిరుగుతున్నారు. కానీ జగన్ సంక్షేమం, కాకాణి చేసిన అభివృద్ధి ముందు సోమిరెడ్డి మాటలు ఎవరికీ చెవికి ఎక్కడం లేదు. దీంతో కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు.
వైఎస్సార్సీపీ సస్పెండ్ చేయడంతో ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి టీడీపీలో చేరారు. ఆనం ఆత్మకూరు, శ్రీధర్‌రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తున్నారు. సోమిరెడ్డికి వారికి చాలా ఏళ్లుగా రాజకీయ వైరం ఉంది. కానీ అదంతా పక్కన పెట్టేసి కొద్దిరోజుల క్రితం వెళ్లి కలిశారు. శాలువాలు కప్పి చర్చలు జరిపారు. సర్వేపల్లిలో తాను గెలిచేందుకు సహకరించాలని కోరారు. మీ పరిచయాలను ఉపయోగించి మాట సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కావాలంటే ప్రచార ఖర్చుల్లో కొంత భరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది.
జిల్లా మొత్తాన్ని సోమిరెడ్డి చుట్టేస్తున్నారు. టీడీపీ ముఖ్యనేతల్ని కలిసి పుష్పగుచ్ఛాలు అందజేస్తూ ఒకసారి వచ్చి మాట సాయం చేయండంటూ వేడుకొంటున్నారు. ఇతర నియోజకవర్గాల్లో చోటా నేతలను కూడా వదడం లేదు. సర్వేపల్లికి వచ్చి తన కోసం కొద్దిరోజులైనా పనిచేయాలని అడుగుతున్నారు. గెలుపు రుచి కోసం సోమిరెడ్డి బాగా దిగజారిపోయారని తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే చెబుతున్నారు.
చేరికల విషయంలోనూ సోమిరెడ్డి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. నిత్యం ప్రచారానికి ఏదో ఊరికి వెళ్లడం.. మాట్లాడాలని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల్ని పిలిచి కండువాలు కప్పేసి వారంతా టీడీపీలో చేరారని డబ్బా కొట్టుకోవడం.. కొద్దిరోజులుగా జరుగుతోంది. అయితే వాళ్లంతా తిరిగి మీడియా ముందు సోమిరెడ్డి నిర్వాకాలు బయటపెట్టి వైఎస్సార్సీపీలో ఉంటామని చెబుతున్నారు. ఈసారి కూడా ఆయన ఓడిపోవడం ఖాయమని, పౌర సన్మానం చేసి సాగనంపాలని నియోజకవర్గం ప్రజానీకం ఎదురు చూస్తోంది.