జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఎల్లో గ్యాంగ్ చిన్నచూపు చూస్తూనే ఉంది. వారు తమవారు కాదని అవమానిస్తూనే ఉంది. సోమవారం రాత్రి నందమూరి బాలకృష్ణ చిత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అతని ప్రసంగానికి ముందు జూనియర్ అభిమానులు తమ హీరో చిత్రం ఉన్న జెండాలను ఊపారు. ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. హీరోకు అనుకూలంగా నినాదాలు చేశారు. నందమూరి వంశమంతా ఒకటే అనే భావనలో ఈ కార్యక్రమం చేపట్టారు. దీంతో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ‘నా కొడకల్లారా ఇక్కడి నుంచి బయటకు పోండ్రా. మేం వచ్చామంటే కాళ్లు విరగ్గొడతాం’ అంటూ తిట్ల దండకం అందుకున్నారు. ఇది బాలకృష్ణ సభ.. ముందు ఇక్కడి నుంచి వెళ్లిపోండని బెదిరించారు. జెండాలు లాక్కోవడమే కాకుండా కొట్టడానికి తరుముకున్నారు.
జూనియర్, ఆయన అభిమానులను చిన్నచూపు చూడడం ఇదేం కొత్త కాదు. గతంలో చంద్రబాబు సభల్లో తారక్ ఫ్లెక్సీలతో కనిపించిన వారిని సాక్షాత్తు చంద్రబాబు నాయుడే తిట్టిపోశాడు. కొంతకాలం క్రితం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఘాట్ వద్ద జూనియర్ ఫ్లెక్సీలను చూసిన బాలకృష్ణ వాటిని అక్కడి నుంచి తీసేయాలని హుకుం జారీ చేశాడు. అంతటితో ఆగకుండా తిట్టాడు.
వాళ్లు ఇదంతా ఎందుకూ పనికిరాని లోకేశ్ కోసమే చేస్తున్నారనేది జగమెరిగిన సత్యం. టీడీపీని అతని చేతిలో పెట్టాలని చంద్రబాబు ప్లాన్. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే నిలబెట్టగలడని మెజార్టీ టీడీపీ అభిమానులు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య విభేదాలు పెరుగుతూ పోతున్నాయి. చిత్తూరులో జరిగిన ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ అభిమానులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పుత్రవాత్సల్యంతో బాబు అండ్ గ్యాంగ్‌ను ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీని నాశనం చేస్తున్నాడని మండి పడుతున్నారు.