నిన్న రాత్రి చంద్రబాబు – పవన్‌కళ్యాణ్ విందు జరిగింది. ఆ భేటీలో ఆరు హామీలపై సమాలోచన జరిపి ఏకాభిప్రాయానికి వచ్చారని చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో ఒక మినీ మానిఫెస్టోని విడుదల చేసిన బాబు, ఇప్పుడు పవన్‌తో భేటీ అనంతరం మరొక ఆరు హామీలను మేనిఫెస్టోలో చేర్చనున్నారు. ఇద్దరూ కలిసి నెలాఖరున తిరుపతిలో జరగబోయే బహిరంగ సభలో వీటిని విడుదల చేయనున్నారు.
అయితే, వీటిలోని “ప్రతి చేతికి పని ప్రతి చేనుకి నీరు” అనే ప్రధాన హామీతో ప్రజలలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. 2014 లో సుమారు 650 హామీలను బాబు ఇస్తే, ఆ మేనిఫెస్టోకి పవన్ మద్దతు ప్రకటించారు. అంతేకాక, వీటిలో ఏది జరగకపోయినా తాను ప్రశ్నిస్తానని, ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని, చంద్రబాబు వంటి అనుభవం ఉన్న నాయకుడైతే విడిపోయిన మన రాష్ట్రానికి చాలా ఉపయోగమని చెప్పుకొచ్చారు.
కానీ, కాలక్రమేణా బాబు అన్ని హామీలను తుంగలో తొక్కి మేనిఫెస్టోని పట్టించుకోకపోయినా పవన్ ప్రశ్నించడం వంటి ప్రోగ్రాములు ఏమీ పెట్టుకోలేదు. గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టు ఏ హామీని అమలు చేయకుండా మోసం చేసినదానికి ప్రతిగా ప్రజలు అన్నీ గుర్తుపెట్టుకుని రెండు పార్టీలకు సరైన రీతిలో ఓట్లతో బుద్ది చెప్పి కనువిప్పు కలిగించారు. ఈసారి కూడా వీళ్ళ అమలు చేయలేని హామీలను చూసి ప్రజలు ఏం చేస్తారో చూడాలి.