ఏపీలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అధికార వైఎస్సార్సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఇంతియాజ్ వైఎస్సార్సీపీలోకి చేరారు. పార్టీ కండువా కప్పి సీఎం జగన్ ఇంతియాజ్‌ను వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. కాగా సెర్ప్ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఇంతియాజ్‌కు 2025, మే 31 వరకు సర్వీసు ఉంది. కానీ తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇంతియాజ్‌కు కర్నూలు అసెంబ్లీ టికెట్ కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం కర్నూలులో సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న హఫీజ్‌ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డిల మధ్య వర్గపోరు జరుగుతున్న నేపథ్యంలో ఇంతియాజ్ వైపు పార్టీ మొగ్గు చూపిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన స్వచ్చంద పదవీ విరమణ చేయడం, దానికి ప్రభుత్వం ఆమోదించడం, వెంటనే ఇంతియాజ్ వైఎస్సార్సీపీ కండువా కప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇంతియాజ్ పోటీ చేయనున్నారో లేదో త్వరలోనే తెలుస్తుంది.
కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కర్నూలు మేయర్ బి.వై.రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్ రెడ్డి పాల్గొన్నారు.