టీడీపీ – జనసేనపొత్తు వరుస చూస్తుంటే.. 2029 ఎన్నికలకు కూడా సీట్లపై ఒక నిర్ణయానికి వచ్చేట్టు కనపడటం లేదు. ఒక పక్క జగన్ ఒక్కో లిస్టులోనూ మార్పులు చేసుకుంటూ చకచకా అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తుంటే… బాబు – పవన్ మాత్రం వారి వారి భేఠీల సమయాన్ని ప్రకటిస్తున్నారు.
లెక్కలు వేసి చూస్తే పవన్ ఇప్పటిదాకా చంద్రబాబుని నోవాటల్ హోటల్లో 3 సార్లు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో 2 సార్లు, చంద్రబాబు హైదరాబాద్ ఇంట్లో 3 సార్లు, చంద్రబాబు ఉండవల్లి నివాసంలో 4 సార్లు,పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఇంట్లో 2 సార్లు,లోకేశ్ పాదయాత్ర ముగింపు సభలో 1 సారి,మొన్న సంక్రాంతి సంబరాల్లో ఒకసారి కలిశారు. మొత్తంగా పదహారు సార్లు కలిసారు. ఇన్ని సార్లు కలిసినా లెక్కలు తేలని పొత్తుగా మిగిలిపోయే అవకాశం కేవలం ఈ జోడీకి మాత్రమే వచ్చేలా ఉంది.
ఈ పక్క పదహారు కన్నా ఎక్కువ సీట్లు ఇచ్చేది లేదని చంద్రబాబు, ఇరవై పైనే కావాలని జనసేన, చంద్రబాబే సీయం అని లోకేష్, సంయమనం పాటిస్తున్నా అని పవన్, పదిహేనిచ్చి గొంతు కోసే చరిత్ర చంద్రబాబుది అని హరిరామజోగయ్య, పవన్ కులాన్ని పార్టీని మోసం చేస్తున్నారంటూ జనసేన నేతలు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈ పొత్తులో ప్రవర్తిస్తున్నారు. ఇదంతా కాక, సందట్లో సడేమియాగా బీజేపీని కూడా పొత్తులో దూర్చేసి, యంపీ అయిపోయి కేంద్ర మంత్రి అయిపోవాలని చిన్నమ్మ పెద్ద పెద్ద ప్లాపులు వేస్తున్నారు. తెలుగు తమ్ముళ్ళు ఎలా ఉన్నా జనసైనికులు మాత్రం ఈ పొత్తు ధర్మంలో థర్మామీటర్లో పాదరసంలా అటూ ఇటూ నలిగిపోతున్నారు.
మరి వీళ్ళ సీట్ల లెక్కలు ఎప్పటికి తేలనో, ఇంకెన్ని భేటీలు కావాలో, గెలిస్తే పవన్ కి వచ్చే హోదా ఏంటి, బీజేపీ కూడా పొత్తులో కలిస్తే వాళ్ళు సీట్ల లెక్కలను కదుపుతారో, చంద్రబాబు కేసు ఫైల్సును కదుపుతారో ఏమీ తోచని అగమ్యగోచరంగా ఉంది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు సిద్ధం కి పోటీగా సంసిద్ధం అని పేరు ఐతే పెట్టగలిగారు కానీ… అది 2024 ఎన్నికలకా? 2029 ఎన్నికలకా అన్నది మాత్రం చెప్పలేదు.