‘నేను ఎమ్మెల్యే, మంత్రి కావడానికి కారణం జగనన్న. ఆయన మాటే నాకు వేదం. అధినేత గీత గీస్తే దాటను. వచ్చే ఎంపీ ఎన్నికల్లో పల్నాడు ప్రజల ఆశీస్సులు నాకు కావాలి’ అంటూ నరసారావుపేట పార్లమెంట్ స్థానంలో కొద్దిరోజులుగా నెలకొన్న సస్పెన్స్‌కు నెల్లూరు సిటీ శాసనసభ్యుడు డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ తెరదించారు. తానే అభ్యర్థినని చెప్పకనే చెప్పారు. పార్టీ నుంచి అధికారికంగా ప్రకటన రావాడమే ఇక మిగిలింది.
నెల్లూరు రూరల్‌లో జన్మించిన అనిల్ చెన్నైలో వైద్య విద్యనభ్యసించారు. 2008లో అనూహ్యంగా రాజకీయాల్లో వచ్చారు. తన బాబాయి మృతితో కాంగ్రెస్ తరఫున కార్పొరేటర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన చురుకుదనాన్ని చూసి దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2009లో నెల్లూరు సిటీ నుంచి బీసీ అయిన అనిల్‌కు అవకాశం కల్పించారు. అయితే ఆనం కుటుంబం వెన్నుపోటు రాజకీయాలకు బలయ్యారు. చాలా తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ధైర్యం కోల్పోకుండా ఆనం కుటుంబానికి ధీటుగా నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కుటుంబానికి చేసిన ద్రోహాన్ని తట్టుకోలేక వైఎస్ జగన్ వెంట నడిచారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ప్రస్థానం ఇలా..
జగన్ అరెస్ట్‌కు నిరసనగా నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశారు అనిల్. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో అధికారం అనుభవిస్తున్న ఆనం కుటుంబం ఇబ్బందులు పెట్టినా భయపడలేదు. తన వాగ్దాటితో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. వ్యక్తిగత ఇమేజ్ కోసం ఏనాడూ పాకులాడలేదు. జగన్ బొమ్మతోనే ప్రజల్లో తిరిగారు. 2014లో వైఎస్సార్సీపీ టికెట్ ఇవ్వడంతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వ తప్పులను ఎండగట్టారు. అసెంబ్లీలో ప్రశ్నలు సంధించి మంత్రులకు చెమటలు పట్టించారు. దీంతో చంద్రబాబు, అప్పుడు మంత్రిగా ఉన్న నెల్లూరుకు చెందిన పొంగూరు నారాయణ అనిల్‌పై కుట్రలకు పాల్పడ్డారు. తనకు సంబంధం లేకపోయినా క్రికెట్ బెట్టింగ్ కేసులో పేరు తెర పైకి తెచ్చారు. తెలుగుదేశం, జనసేన నాయకులు, వారి సోషల్ మీడియా అనిల్‌పై వ్యక్తిత్వ హననానికి దిగాయి. అయినా అనిల్ బెదరలేదు. ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. 2019 ఎన్నికల్లో మరోసారి జగన్ టికెట్ ఇచ్చారు. కార్పొరేట్ విద్యాసంస్థల మాఫియా లీడర్ అయిన నారాయణకు టీడీపీ సీటు ఇచ్చింది. ఈయన కోట్ల రూపాయలు గుమ్మరించినా అనిల్ విజయాన్ని అడ్డుకోలేకపోయారు. తన కోసమే రాజకీయాలు చేసే అనిల్‌కు జగన్ పెద్దపీట వేస్తూ ఇరిగేషన్ శాఖ మంత్రిని చేశారు. దీంతో ఆయన చరిష్మా పెరిగింది. బీసీల్లో అతిపెద్ద నాయకుడిగా ఎదిగారు. మంత్రిగా రాష్ట్రస్థాయిలో తిరుగుతూనే తన నియోజకవర్గాన్ని మర్చిపోలేదు. స్థానికులకు అందుబాటులో ఉంటూ పనులు చేశారు. జగన్ ఆశీస్సులతో ఇప్పుడు అనిల్ మరో మెట్టు ఎక్కబోతున్నారు. నరసారావుపేట ఎంపీ స్థానంలో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.
ఉద్దండులు గెలిచిన చోటు
రాష్ట్రంలో నరసారావుపేట ఎంపీ స్థానానికి ఒక ప్రత్యేకత ఉంది. గురజాల, చిలకలూరిపేట, నరసారావుపేట, పెదకూరపాడు, మాచర్ల, వినుకొండ, సత్తెనపల్లి దీని పరిధిలో ఉన్నాయి. ఇక్కడ ఎంతో మంది రాజకీయ ఉద్దండులు ఎంపీగా గెలుపొందారు. వారిలో కాసు బ్రహ్మానందరెడ్డి, కాసు వెంకటకృష్ణారెడ్డి, కొణిజేటి రోశయ్య ఉన్నారు. అలాంటి చోట లావు శ్రీకృష్ణదేవరాయులుకు జగన్ అవకాశం ఇచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో రాజకీయ సమీకరణాల రీత్యా ఆయన్ను వేరే చోట పోటీ చేయాలని సీఎం సూచించారు. అగ్రకులస్తుడైన తనను కాదని బీసీకి సీటు ఇవ్వాలని నిర్ణయించడం లావుకు నచ్చలేదు. దీంతో తన తండ్రి ఎంతగానో వ్యతిరేకించిన చంద్రబాబుకే దగ్గరయ్యారు. అయితే అనిల్ తాజాగా చేసిన ప్రకటన నరసారావుపేటలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. మాస్ ఇమేజ్ ఉన్న అతని ముందు తాను సరిపోనని ఆర్థికంగా బలవంతుడైన శ్రీకృష్ణదేవరాయులు భావిస్తున్నారు. పోటీ చేయాలా.. వద్దా.. అనే పునరాలోచనలో పడ్డారు.
నెల్లూరు వారికి కొత్త కాదు
నరసారావుపేటం ఎంపీ సీటు నెల్లూరు వారికి కొత్త కాదు. ఇది పరిచయమైన ప్రాంతమే. ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడు మండలానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి 1999లో ఇక్కడ పోటీ చేసి గెలిచారు. అలాగే ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలానికి చెందిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి 2004లో విజయం సాధించారు. ఇప్పుడు నెల్లూరుకు చెందిన అనిల్ బరిలో దిగబోతున్నారు. ఒకప్పుడు అసెంబ్లీలో బాబుపై మాటల తూటాలు వదిలిన ఆయన ఇకనుంచి ఢిల్లీ స్థాయిలో రెచ్చిపోతానని ప్రకటించారు. కార్పొరేటర్‌గా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన అనిల్ సీఎం జగన్ దయతో ఎంతో ఎత్తు ఎదిగారు. మాటలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించే నాయకుడికి సింహపురి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నరసారావుపేటలోనూ అనిల్ తన మార్క్ వేస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు.