ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ స్థాయిలో పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమీషన్ముఖేష్ కుమార్ మీనా మీడియాకు వెళ్ళడించారు. తుది పోలింగ్ శాతం 80.66 గా, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.2 శాతం మొత్తం కలుపుకుని 81.86 శాతంగా పోలింగ్ శాతం నమోదైందని ఆయన ప్రకటించారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే భారీగా నమోదైన పోలింగ్ శాతంగా ఆయన చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం కన్నా ఇది 2 శాతం అధికంగా కనిపిస్తుంది.
ఇదిలా ఉంటే పోలింగ్ శాతం వివరాలను బయటకు ప్రకటించగానే రాష్ట్రంలో అన్ని పార్టీలు తమకే మేలు చేయబోతుందని ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. పెరిగిన పోలింగ్ శాతం అధికార పక్షానికి దెబ్బ అని తెలుగుదేశం చెబుతుంటే, పెరిగిన శాతం తమకే మేలని అధికార వైసీపీ గట్టిగా చెబుతుంది. నిజానికి వైసీపీ చెప్పినట్టే 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సందర్భంలో వచ్చిన ఓటింగ్ శాతం కన్నా 2009లో తిరిగి అదే కాంగ్రెస్ అధికారం పొందడానికి వచ్చిన ఓట్ల శాతం 2% అధికంగా కనిపిస్తుంది. కాబట్టి తెలుగుదేశం వాదనలో నిజం లేదని పలువురు చెబుతున్న మాట.
అలాగే పోలింగ్ స్టేషన్లలో గతంలో ఎన్నడులేని విధంగా మహిళా ఓటర్లు భారి స్థాయిలో బారులు తీరి అర్ధరాత్రైనా వేచి ఉండి తమ ఓటు హక్కు వినియోగించుకునట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మహిళలు గతంలో లేని విధంగా మూకుమ్మడిగా ఒకే పార్టీకి కొమ్ముకాసినట్టు పలు సర్వేలు చెబుతున్న నేపథ్యంలో రేపు ఫలితాలు ఎలా రాబోతున్నాయొ ఇప్పటికే ఒక అంచనాకు వస్తున్నారు. తుది ఫలితాలు తేలాలి అంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.