కూటమిలోని టీడీపీ, జనసేనలో రెబల్స్ బెడద వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటివరకు కూటమిలో 16 చోట్ల అధికారికంగా రెబల్స్ పోటిలో నిలబడ్డారు. టీడీపీ లెక్కల ప్రకారం 9 చోట్ల , జనసేన బిజెపి లకు 7 చోట్ల రెబల్స్ బెడద వుంది. చూస్తుంటే అనధికారికంగా దాదాపు ముప్పై చోట్ల రెబల్స్ కూటమితో తాడో పేడో తేల్చుకోవడానికి బరిలో నిలిచారు. ఇప్పుడు ఇదే కూటమికి ముఖ్యంగా టీడీపీ, జనసేన అభ్యర్థులకు హడలు పుట్టిస్తోంది. దీనిలో గమ్మత్తు ఏమిటంటే తిరుగుబాటు అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు దక్కడం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జగ్గంపేటలో జనసేన రెబల్ అభ్యర్థిగా సూర్యచంద్ర నిలబడటం అతనికి గాజు గ్లాసు గుర్తు దక్కడం గమనార్హం. అంతే కాకుండా గజపతి రాజుల వారసురాలు అదితి గజపతి మీద టీడీపీ రెబల్ గా పోటి చేస్తున్న మాజీ ఎంఎల్ఏ మీసాల గీతకు గాజు గ్లాసు గుర్తు దక్కడంతో విజయనగరం టీడీపీ శ్రేణులు గెలుపుమీద ఆశలు వదులుకున్నారు.
మరో కీలక నియోజకవర్గం కావలి నియోజకవర్గంలో టీడీపీ రెబల్ అభ్యర్థి పసుపులేటి సుధాకర్ కు కూడా గాజు గ్లాసు గుర్తు దక్కడంతో టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణ రెడ్డి పార్టీ పెద్దల మీద చిటపటలాడుతున్నారు. అంతే కాకుండా మాచర్ల, పెడన,అరకు, రాప్తాడు, పోలవరం, ఎచ్చెర్ల, గన్నవరంలో కూటమికి రెబల్స్ చుక్కలు చూపిస్తున్నారు. మరి ముఖ్యంగా ఉండిలో రఘురామ కృష్ణంరాజు తన నోటి దూలతో అవమానించడంతో పాటు నమ్మించి మోసం చేశారని మాజీ ఎంఎల్ఏ శివరామ రాజు రెబల్ గా పోటిలో నిలిచి మెజారిటీ టీడీపీ కార్యకర్తల మద్దతు పొందుతున్నారు. టీడీపీ కీలక నేత బాలకృష్ణ మీద పరిపూర్ణానంద స్వామి పోటీలో నిలిచి బాలకృష్ణకు సవాల్ విసురుతున్నారు. ఇక అనకాపల్లి కూటమిలో టీడీపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ మాట్లాడితే నా పేరు సీఎం రమేష్, సీఎం కంటే పవర్ఫుల్ అంటూ మాటలు కోటలు దాటేలా మాట్లాడే రమేష్ చివరకు తన పలుబడితో అనకాపల్లి ఎంపీ, పాయకరావుపేట లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు రాకుండా అడ్డుకోలేక పోయారు. పేరుకు ముప్పై చోట్ల రెబల్స్ కనబడుతున్నారు గానీ చాలా చోట్ల టికెట్ రాని నాయకులు వెన్నుపోటు పొడుస్తారని కూటమి నేతలే బహిరంగంగా చెప్పుకుంటున్నారు.