సుప్రీంకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి అక్రమంగా డిపాజిట్లను సేకరించిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీం కోర్టులో గత కొంతకాలంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడైతే ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జోక్యం చేసుకుని సుప్రీం కోర్టులో వాదనలు వినిపించడం మొదలుపెట్టిందో అప్పటినుండి మార్గదర్శి కేసు వేగం పుంజుకుంది. తాజాగా మార్గదర్శికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
మార్గదర్శి ఫైనానిషియర్స్ కేసులో తొలిసారి ఆర్బీఐ నోరు విప్పడంతో మార్గదర్శి అక్రమ పద్దతిలో డిపాజిట్లను సేకరించిందని రుజువైంది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45ఎస్ ప్రకారం హెచ్యూఎఫ్(హిందూ అన్ డివైడెడ్ ఫామిలీ) పేరిట డిపాజిట్లు సేకరించడంచట్ట విరుద్ధమని ఆర్బీఐ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా గతంలో దాదాపు 2600 కోట్ల రూపాయల డిపాజిట్లు స్వీకరించిన మార్గదర్శి తాజాగా మరో రెండు వేల కోట్ల రూపాయల డిపాజిట్లను సైతం స్వీకరించారని సుప్రీంకోర్టు దృష్టికి ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి తీసుకువచ్చారు. దీంతో ఏప్రిల్ 9న మార్గదర్శి కేసులో సమగ్ర విచారణ చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది.
డిపాజిట్ల సేకరణలో మార్గదర్శి అక్రమాలకు పాల్పడిందని ఆర్బీఐ ధృవీకరించిన నేపథ్యంలో మార్గదర్శిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. కాగా ఈ పరిణామం మార్గదర్శికి పెద్ద ఎదురుదెబ్బనే చెప్పవచ్చు. ఏప్రిల్ 9 న మార్గదర్శి కేసుపై విచారణ చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించిన నేపథ్యంలో మార్గదర్శి ఈ సమస్యనుండి ఎలా బయటపడుతుందనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా పన్నెండేళ్లకు పైగా సాగుతున్న మార్గదర్శి కేసుకు త్వరలోనే ఎండ్ కార్డు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రామోజీరావు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.