రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారు. ఏపీ యువతకు స్థానికంగా ఉద్యోగాలు లభించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా పెట్టుబడుల సదస్సులు పెట్టారు. మనకు ఉన్న సుదూర తీర ప్రాంతాన్ని వినియోగించుకుంటున్నారు. పోర్టులు నిర్మిస్తున్నారు. దాని ఆధారిత పరిశ్రమలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2019 నుంచి ఇప్పటి వరకు 127 పెద్ద పరిశ్రమలు రూ.67,000 కోట్ల పెట్టుబడులతో వచ్చాయి. 85,000 మందికి ఉపాధి లభించింది.
తాజాగా విశాఖ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో రెండు పారిశ్రామిక పార్కుల అభివృద్ధి జగన్ ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆ కారిడార్లో సదుపాయాలను కల్పిస్తున్నారు. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు పక్కా ప్రణాళికతో జరుగుతున్నాయి. నక్కపల్లి నోడ్ పరిధిలో 4,300 ఎకరాల భూమిని సేకరించారు. రూ.33,500 కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నారు. 25 వేల మందికి ఉపాధి కల్పించేలా రూపొందించిన ప్రాజెక్టు ఇది. ఇక శ్రీకాళహస్తి నోడ్ పరిధిలో 12 వేల ఎకరాలు సేకరించారు. రూ.19,700 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 42,680 మందికి ఉపాధి లభిస్తుందని చెబుతున్నారు. త్వరలో చెన్నై – బెంగళూరు కారిడార్లో క్రిస్ సిటీ అభివృద్ధి పనులకు భూమి పూజ జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
పరిశ్రమలు ఒకేచోట ఏర్పాటైతే అభివృద్ధి వికేంద్రీకరణ జరగదు. దీంతో ప్రభుత్వం వేర్వేరు చోట్ల పారిశ్రామికవాడలు తెస్తోంది. చంద్రబాబు హయాంలో మాటలే తప్ప ఇండస్ట్రియల్ అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. అంతా అమరావతిపైనే దృష్టి సారించి దోచుకున్నారు. అయితే జగన్ సర్కార్ అలా చేయడం లేదు. ప్రతి జిల్లా అభివృద్ధిపై శ్రద్ధ పెట్టింది. పారిశ్రామిక కారిడార్ల వల్ల త్వరలో మరిన్ని ఉద్యోగాలు రావడం ఖాయం.