జగన్ ప్రభుత్వంపై అక్కసుతో రగిలిపోతూ, ఓ రాజకీయ పార్టీకి లబ్ది చేకూర్చేలా విద్వేషపూరిత కథనాలను ప్రసారం చేస్తున్న ఈనాడు మరోసారి జగన్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేసింది. ఈసారి పాడి రైతుల జీవితాల్లో వెలుగులను నింపేందుకు ప్రయత్నం చేస్తున్న అమూల్ పై విష ప్రచారానికి పూనుకుంది. ప్రభుత్వం కొన్ని డైరీలను అమూల్ పరం చేస్తుందంటూ వాస్తవ దూర కథనాలను ప్రచురించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది ఈనాడు. కానీ వాస్తవాలు మరోలా ఉన్నాయి.
పాడి రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి సీఎం జగన్ డెయిరీ రంగంలో అగ్రగామిగా ఉన్న అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకుని ‘అమూల్ పాలవెల్లువ’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అమూల్ రాకతో ప్రైవేట్ డెయిరీల దోపిడీకి అడ్డుకట్ట పడింది. అమూల్ రాక అనంతరం పాల ధర ఏడు సార్లు పెరగడం గమనార్హం. దీనివలన ఇతర పాల డైరీలు కూడా రైతులకు అదే ధర ఇవ్వాల్సి రావడం తో పాడిరైతులకు 4,818 కోట్ల అదనపు లబ్ధి చేకూరింది. రాష్ట్రంలో దశాబ్దాల చరిత్ర ఉన్న ప్రైవేట్ డెయిరీలు రోజుకు 4 లక్షల లీటర్ల పాలను సేకరిస్తుండగా నిండా మూడేళ్లు కూడా నిండని అమూల్ సంస్థ రోజుకు 3.75 లక్షల లీటర్ల పాలు సేకరిస్తోంది. ఈ వాస్తవాలను ఈనాడు వక్రీకరించే ప్రయత్నం చేసింది.
గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల కొన్ని ప్రైవేటు డెయిరీలు మూతపడ్డాయి. వాటితో పాటు యూహెచ్‌టీ, పౌడర్ ప్లాంట్లు, ఎంసీసీలతో పాటు 141 బీఎంసీయూలను మూసేశారు. పాడి రైతుల కోసం పాల సేకరణకు 317 మండలాల్లో 6684 గ్రామాలను గుర్తించారు. ఇప్పటికే 137 చోట్ల బీఏంసీయూ భవనాలు నిర్మించారు. గ్రామ స్థాయిలో పాల సేకరణ, పరీక్ష, శీతలీకరణ కార్యకలాపాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.126 కోట్లు విడుదల చేసింది.
మూతపడిన డెయిరీలను పునరుద్దరించేందుకు జగన్ ప్రభుత్వం నడుం బిగించింది. అందులో భాగంగా లిక్విడేషన్‌లో ఉన్న చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ కోసం అమూల్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టు కోసం అమూల్ రూ.385 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. చిత్తూరు డెయిరీకి రూ.182 కోట్లు అప్పులు తీర్చి అప్పగించారంటూ చేసిన ఆరోపణలో వాస్తవం లేదు. డెయిరీలోని కొంత భాగాన్ని మాత్రమే అమూల్‌కు లీజుకు ఇచ్చారు. వాటి ఆస్తులు, భూములపై అమూల్‌కు ఎలాంటి హక్కులు కల్పించలేదు. వాస్తవానికి ఈ బకాయిలన్నీ గత ప్రభుత్వ హయాం నుంచి ఉన్నవే. వాటిని జగన్ ప్రభుత్వం క్లియర్ చేసిందే తప్ప అమూల్‌కు లీజుకు ఇచ్చేందుకు చెల్లించలేదు.
ఒంగోలు డెయిరీని మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో అమూల్‌కు లీజుకు ఇచ్చేలా చర్చలు జరుగుతున్నాయి. ఒంగోలు డెయిరీలో రూ.400 కోట్లకు పైగా పెట్టుబడులు అమూల్ పెట్టేందుకు ముందుకొచ్చింది. అలాంటపుడు రూ.60 వేల కోట్ల విలువైన ఆస్తులు ధారాదత్తం చేస్తున్నారని రామోజీ అర్థం పర్ధం లేని వార్తలు రాస్తున్నారు. ఇలా సత్యదూరమైన వార్తలతో ప్రజలను అయోమయానికి గురి చేయడమే రామోజీ లక్ష్యం.
2019 ఎన్నికలకు ముందు లీటర్‌కు రూ.4 చొప్పున అదనపు లబ్ధి చేకూరుస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకి మిన్నగా లీటర్‌కు రూ.10 నుంచి రూ.20 వరకూ అదనపు లబ్ధి పాడి రైతులకు చేకూరుస్తున్నారు. గేదె పాలు లీటరుకు రూ.18.29, ఆవు పాలకు రూ.9.49కు పెంచారు. కానీ ఈ వాస్తవాలను చెప్పకుండా సత్యదూర కథనాలను వండి వార్చడం రామోజీకే చెల్లింది.