పాలకులకు విజన్ ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుంది. సీఎం జగన్ నవ్యాంధ్రలో ఉన్న వనరులతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు.
రాష్ట్రంలో 974 కిలోమీటర్ల సువిశాల తీర ప్రాంతం ఉంది. దీనిని వినియోగించుకొని ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించేందుకు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జగన్ సర్కార్ అన్ని చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా రూ.20 వేల కోట్లతో కోస్తా తీరాన్ని అభివృద్ధి చేస్తోంది. ఒకేసారి నాలుగు గ్రీన్ ఫీల్డ్ పోర్టులతోపాటు 10 మినీ పోర్టుల తరహాలో ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ లాండింగ్ సెంటర్లకు శ్రీకారం చుట్టింది.
ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖలో మేజర్ పోర్టుతోపాటు మరో 5 నాన్ మేజర్ పోర్టులు గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ డీప్వాటర్, కాకినాడ యాంకరేజ్, రవ్వ కాపిటివ్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకో నాలుగు పోర్టులను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది.
రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను రాష్ట్ర ల్యాండ్ లార్డ్ మోడల్లో, కాకినాడ గేట్వే పోర్టును పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తున్నారు
రామాయపట్నం సిద్ధం
నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. సుమారు 850 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,902 కోట్ల పెట్టుబడి అంచనాతో రామాయపట్నం పోర్టుకు సీఎం జగన్ 2022 జూన్లో భూమి పూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. తొలి దశలో నాలుగు బెర్త్ లు కట్టేందుకు చర్యలు తీసుకున్నారు. బల్క్ బెర్త్ పనులు దాదాపు పూర్తి కావడంతో ఈనెలాఖరు లేదా ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు మారిటైమ్ బోర్డు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ ముందుచూపుతో పనులు మొదలుపెట్టిన 18 నెలల్లోనే ఈ పోర్టు వాణిజ్యపరంగా కార్యకలాపాలు సాగించేందుకు సిద్ధమైంది. 23 ఎకరాల్లో పునరావాస గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు.
కల సాకారం
రామాయపట్నం పోర్టు ప్రకాశం నెల్లూరు జిల్లా వాసుల కల. పోర్టు వద్ద ఎనిమిది వేల ఎకరాల్లో పారిశ్రామిక పార్కు అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇవి పూర్తయితే లక్షలాది మంది ప్రజలకు ఎన్నో రకాలుగా ఉపయోగాలు ఉంటాయి.
చిత్తశుద్ధి లేని చంద్రబాబు..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏనాడు రాష్ట్ర అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. తనకు ఉపయోగపడే పనుల పైనే ఆయన చూపు ఉండేది. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఒక్క పోర్ట్ కూడా కట్టలేకపోయాడు. నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలంలో కృష్ణపట్నం పోర్టును నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి కట్టించారు. 2019 ఎన్నికల ముందు చంద్రబాబు రామాయపట్నం వద్ద పైలాన్ ఆవిష్కరించి షో చేశారు. వైఎస్ఆర్ తనయుడు జగన్ అన్ని అనుమతులతో రామాయపట్నం పోర్టుకు శ్రీకారం చుట్టారు. మరికొద్ది రోజుల్లోనే తొలి నౌక లంగర్ వేయనుంది. ఆరు నెలల్లోనే మిగిలిన మూడు బెడ్లు అందుబాటులోకి వస్తాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
మరికొన్ని..
రూ.91.18 కోట్లతో చేపట్టిన కాకినాడ యాంకరేజ్ పోర్టు ఆధునికీకరణ పనులు పూర్తి కానుండటంతో పోర్టు సామర్థ్యం పెరగనుంది. ఈ ఏడాది చివరి నాటికి కాకినాడ గేట్వే పోర్టు నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తంగా 2025 నాటికి రాష్ట్రంలో మొత్తం పది పోర్టులు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెల్తోంది.
– వీకే..