2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం జనసేన పార్టీ అభ్యర్ధులు ఓడిపోయినా , చివరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయినా కూడా రాజోలులో జనసేన అభ్యర్ధి రాపాక వరప్రసాదరావు విజయం సాధించారు. అలాంటి రాజోలులో ఈరోజు జనసేన పార్టీ అడుగులు తడబడుతున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు సంబందం లేని రిటైర్డు ఐఏఎస్ అధికారి అయిన దేవ వరప్రసాద్ కు టికెట్ కేటాయించారు.ఇప్పుడు ఇదే జనసేన పార్టీ కి తలనొప్పులు తెచ్చి కార్యకర్తలు అంతా స్తబ్దుగా ఉండిపోయేలా చేసింది. దేవ వరప్రసాద్ కుటుంబ నేపథ్యం రాజోలు అయినా కూడా ఐఏఎస్ అయిన తరువాత తన పుట్టిన ఊరుకి, తన నియోజకవర్గంలో చేసింది ఏమి లేదని, ఒక్క రూపాయి సహాయం కూడా చెయ్యలేదని నియోజకవర్గ ప్రజల మాట. కేవలం ఐఏఎస్ గా రిటైర్డ్ అయిన తరువాత జనసేనలో జాయిన్ అయ్యి, పార్టీ లోని ముఖ్య నాయకులను ప్రసన్నం చేసుకుని లోకల్ గా జనసేనకు ఆర్థికంగా అండగా నిలబడే వారి తోడ్పాటు తీసుకొని టికెట్ సంపాదించారు తప్ప ఇక్కడి ప్రజలతో గానీ కార్యకర్తలతో గానీ ఎటువంటి సంబంధం లేదని ఆరోపిస్తూ పార్టీ అభ్యర్థికి దూరంగా వున్నారు జన సైనికులు .
2019 లో గెలిచిన తరువాత రాపాక వరప్రసాద్ కు జనసేన పార్టీలో జరిగిన అవమానాలు భరించలేక వైసీపీ లో జాయిన్ అయ్యారు. అయితే 2014,2019 లో ఇదే రాజోలులో పోటీ చేసి ఓడిపోయిన బొంతు రాజేశ్వరరావు మీద నియోజకవర్గంలో సానుభూతి వుంది. రాపాక వరప్రసాద్ వైసీపీ లో జాయిన్ అవ్వగానే బొంతు రాజేశ్వరరావు జనసేనలో జాయిన్ అయ్యి పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసుకుంటూ వచ్చారు. చివరకు బొంతు రాజేశ్వరరావుకు కాకుండా దేవ వరప్రసాద్ కు టికెట్ ఇవ్వడంతో నియోజకవర్గంలోని నాలుగు మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు బొంతుకి టికెట్ ఇవ్వాలని కోరుతూ పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. ఈరోజు వరకు వరప్రసాద్ తో కలిసి ప్రచారానికి కూడా వెళ్లడం లేదు.
ఇదే సమయంలో టీడీపీలో కూడా ఒక వర్గం దేవ వరప్రసాద్ కు సపోర్ట్ చేస్తా ప్రచారంలో తిరుగుతున్నది. మరో వర్గం మాత్రం జన సేన నాయకులే సపోర్ట్ చెయ్యడం లేదు ఇలా అయితే ఓడిపోతామని టీడీపీ అధినేతకు నియోజకవర్గ పరిస్థితులు వివరించి అభ్యర్థిని మార్చమని ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు ఇక్కడ బొంతు రాజేశ్వరావుకు కాకుండా దేవ వరప్రసాద్ కు బీ ఫారం ఇస్తే జనసేన నిట్టనిలువునా చీలి అభ్యర్థికి మద్దతు కూడా ఇవ్వకుండా ప్రచారం నుండి తప్పుకునే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూడాలి కూటమి అధినేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో.