ఎన్నికల ప్రక్రియలో ఓట్ల లెక్కింపు చిట్టచివరి ప్రధాన అంశం. నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ పర్యవేక్షణలో, నియోజకవర్గ అభ్యర్ధి నియమించుకున్న ఏజెంట్ల సమక్షంలో జరుగుతాయి. చట్టం ప్రకారం అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టవచ్చు.
నియోజకవర్గ పార్టీ అభ్యర్ధి ప్రతినిధిగా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కౌంటింగ్ ఏజెంట్ చాలా కీలక పాత్ర పోషించడంతో పాటు, వారి సహకారంతో కౌంటింగ్ పర్యవేక్షకులు మరియు కౌంటింగ్ సహాయకుల ముఖ్యమైన పనులు సులభతరం అవుతాయి. EVM, VVPAT ల ద్వారా జరిగే పోలింగ్ విధానం మరియు తాజా నియమాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఇందుకుగాను, EVM, VVPATలు పనిచేసే విధానంపై రిటర్నింగ్ అధికారి నిర్వహించే ప్రదర్శనకు తప్పనిసరిగా హాజరవ్వాలి.
కౌంటింగ్ ఏజెంట్లు నిర్దిష్ట అర్హత కలిగి ఉండాలని చట్టం ప్రకారం సూచించలేదు. అయినప్పటికి, కౌంటింగ్ ఏజెంట్లను నియమించే క్రమంలో 18 సంవత్సరాలు నిండిన, లెక్కలు తొందరగా, జాగ్రత్తగా వేయగలిగే వారికి ప్రాధాన్యతనిచ్చేలా పార్టీ అభ్యర్ధి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కౌంటింగ్ ఏజెంటుగా మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఛైర్మన్లు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, నగర కార్పొరేషన్ మేయర్లు, మునిసిపల్ ఛైర్మన్లు, నగర పంచాయితీల ఛైర్మన్లు, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి కో-ఆపరేటివ్ సంస్థల ఛైర్పర్సన్లు, ప్రభుత్వ న్యాయవాదులు, ప్రభుత్వ ఉద్యోగులు మరియు భద్రతా సిబ్బంది కలిగిన నాయకులను నియమించరాదు.
నియోజకవర్గ కౌంటింగ్ టేబుల్ కి అనుగుణంగా పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్ధులు వేరు వేరుగా ఏజెంట్లను తప్పనిసరిగా నియమించుకోవాల్సివుంటుంది. సాధారణంగా ఒక రౌండ్ కౌంటింగ్ కు 14 టేబుళ్ళు, 1 టేబుల్ పోస్టల్ ఓట్ల లెక్కింపుకు ఏర్పాటు చేస్తారు. పోస్టల్ ఓట్ల లెక్కింపు రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద జరుగుతుంది. కావున, రిటర్నింగ్ అధికారి టేబుల్ కు ఒక కౌంటింగ్ ఏజెంట్ తో కలిపి మొత్తం 15 మంది కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవాలి. ఒకవేళ టేబుల్స్ పెంచితే, ముందుగానే RO/ ARO తెలియపరుస్తారు. తగు విధంగా ఏజెంట్ల సంఖ్య పెంచుకోవచ్చు.
నియోజకవర్గ అభ్యర్ధి (లేదా) అభ్యర్థి యొక్క ప్రధాన ఎలక్షన్ ఏజెంట్ ద్వారా కౌంటింగ్ ఏజెంట్లు నియమించబడతారు.ఒక్క ఫారం-18 ని ఉపయోగించి కౌంటింగ్ ఏజెంట్లు అందరిని నియమించుకోవచ్చు,కౌంటింగ్ కి 3 రోజుల ముందు ఒక ఒరిజినల్ కాపీని, కౌంటింగ్ ఏజెంట్ల 2 ఫోటోలతో సహా రిటర్నింగ్ అధికారికి అందజేయాలి.మరొక ఒరిజినల్ కాపీని కౌంటింగ్ రోజున కౌంటింగ్ ఏజెంట్ సంబంధిత రిటర్నింగ్ అధికారికి అందజేయాలి.
కౌంటింగ్ ఏజెంట్ల ఐడి కార్డులను ఒక రోజు ముందే రిటర్నింగ్ అధికారి నుండి నియోజకవర్గ పార్టీ అభ్యర్ధి సేకరించి పెట్టుకోవాలి. కౌంటింగ్ రోజున, కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించబడిన వారు కౌంటింగ్ ప్రారంభం సమయానికి ఒక గంట ముందుగానే కౌంటింగ్ కేంద్రానికి చేరుకుని వారి ఐడి కార్డును మరియు నియామకపత్రాన్ని తప్పనిసరిగా రిటర్నింగ్ అధికారికి చూపించినప్పుడే అనుమతించబడతారు.
ఏదైనా కారణంతో కౌంటింగ్ ఏజెంట్ నియామకాన్ని రద్దు చేయదలచుకుంటే, నియోజకవర్గ అభ్యర్థి (లేదా) ప్రధాన ఎలక్షన్ ఏజెంట్ కౌంటింగ్ ప్రారంభానికి ముందు ఏ సమయంలోనైనా కౌంటింగ్ ఏజెంట్ నియామకాన్ని రద్దు చేయవచ్చు.ఫారం-19 ( Annexure II ) ద్వారా కౌంటింగ్ ఏజెంట్ నియామకాన్ని రద్దు చేయాలి.రద్దు చేయబడిన వారి స్థానంలో వేరొకరిని కౌంటింగ్ ఏజెంట్ గా నియామకం చేయవచ్చు. కౌంటింగ్ ప్రారంభమయిన తరువాత నూతనంగా కౌంటింగ్ ఏజెంట్ల నియామకం చేసేందుకు వీలు ఉండదు
బ్రేక్ ఇచ్చినప్పుడు తప్పితే కౌంటింగ్ టేబుల్ వీడరాదు. మరీ ముఖ్యంగా కౌంటింగ్ జరుగుతున్నప్పుడు పూర్తి ఏకాగ్రతతో ఉండాలి. ప్రతి రౌండ్‌కు లెక్కింపు పూర్తి కాగానే ఫలితాలను అందుకు సంబంధించిన పత్రములపై టేబుల్ ఇంఛార్జ్ సక్రమంగా నమోదు చేసి సంతకం చేసినది, లేనిది జాగ్రత్తగా గమనించాలి,ఎవరయినా టేబుల్ ఇంఛార్జ్ సక్రమంగా కౌంటింగ్ చేయడం లేదని గాని, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని గానిమీరు గుర్తిస్తే, వెంటనే రిటర్నింగ్ అధికారికి అతను ఏ తప్పులు చేస్తున్నాడో వ్రాతపూర్వకంగా తెలియజేసి తగిన పత్రాన్ని తీసుకోవాలి, ఆ ఓట్లను తిరిగి కౌంటింగ్ చేయమని అడగాలి. ఆ వ్రాతపూర్వక పత్రం నకలును కూడా మీ వద్ద ఉంచుకోవాలి.
మనకు మన ప్రత్యర్ధి కన్నా తక్కువ ఓట్ల వ్యత్యాసం ఉన్నప్పుడు తప్పకుండా రీ కౌంటింగ్ ని అడగడం, ఎప్పటికప్పుడు అభ్యర్థి దృష్టిలో అన్ని వివరాలు ఉంచడం, RO/ARO / మైక్రో-అబ్జర్వర్ కి రీకౌంటింగ్ ఆవశ్యకత వివరించడం చాలా ముఖ్యం. ఒక్కసారి ఫలితం ప్రకటిస్తే, దానిని కోర్టులో మాత్రమే ఛాలెంజ్ చేయగలరని గుర్తుపెట్టుకోవాలి.
2 కొత్త బాల్ పెన్లు, రైటింగ్ పాడ్, A4 సైజు తెల్ల కాగితాలు, calculator, టేబుల్ కౌంటింగ్ ఫారాలు తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. ఫారం-17A అనగా పోలింగ్ సమయంలో ఓటర్ల నమోదు రిజిష్టర్. ఓటరుకు ఓటు ఇచ్చు సమయంలో, ఓటరు వివరాలను నమోదు చేసుకుని ఓటరుచే సంతకం లేదా వేలిముద్ర వేయించునటువంటి రిజిస్టర్. ఫారం-17B అనగా టెండరు ఓటు రిజిస్టర్ ఫారం-17C, పార్ట్-I అనగా ఓటర్ల సమగ్ర నమోదు వివరాలు పొందుపరిచి ఉంటుంది. ఫారం-17C, పార్ట్-II అనగా పోలింగ్ బూత్ కౌంటింగ్ పూర్తయిన తరువాత, బూతెయొక్క ఫలితాల వివరములను ఫారం-17C, పార్ట్-II నందు నమోదు చేస్తారు.