ఒకప్పటి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి చంద్రబాబు అండ్ కో గాలి తీసేశారు. ఇండియా టీవీ నిర్వహించిన ఆప్ కీ అదాలత్ ఇంటర్వ్యూలో ఆయన పాల్గొన్నారు. ఈ సమయంలో యాంకర్ చంద్రబాబు మిమ్మల్ని బిహార్ డెకాయిట్ అన్నాడు కదా.. మరి ఎలా వెళ్లి కలిశారని ప్రశ్నించారు. దీనికి ప్రశాంత్ ఇలా స్పందించారు. బాబు నా మద్దతు కావాలని అడిగారు. నేను నో చెప్పాను. ఆయనతో వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వం లేదు. అయితే నేను ఎన్నికల వ్యూహకర్తగా ప్రస్తుతం పనిచేయడంలేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పా. ఓడిపోతే బాబు అసహనానికి గురవుతారని వెల్లడించారు.
చంద్రబాబు బెయిల్పై జైలు నుంచి వచ్చాక ప్రశాంత్ కిశోర్ ఆయన్ను విజయవాడకు వచ్చి కలిశారు. ఆ సమయంలో నారా లోకేశ్ కూడా వెంట ఉన్నారు. దీంతో తెలుగుదేశం, ఎల్లో మీడియా రెచ్చిపోయాయి. ప్రశాంత్ జగన్ను వదిలేశాడని, ఇకనుంచి బాబు కోసం పనిచేస్తారని ప్రచారం చేశాయి. దీనిని లోకేశ్ గొప్పతనంగా చూపించాయి. అయితే ప్రశాంత్ ఓ ఇంటర్వ్యూలో వారి మాటల్ని కొట్టిపారేశారు. తాను టీడీపీ కోసం పనిచేయడం లేదని స్పష్టం చేసి ఎల్లో గ్యాంగ్ ఆశల్ని నీరుగార్చేశారు.
నారా వారంతే. ఎవరినైనా తిట్టగలరు. కాసేపు ఆగి కౌగిలించుకోగలరు. ఆయన నైజం అది. నరేంద్రమోదీని వ్యక్తిగతంగా దూషించి నేడు ఆయన స్నేహం కోసం పాకులాడుతున్నారు. ప్రశాంత్ కిశోర్ వైఎస్సార్సీపీకి పనిచేస్తున్న రోజుల్లో మాటల దాడి చేశారు. దొంగ అన్నారు. ఈ రాష్ట్రాన్ని మరో బిహార్ చేయాలని చూస్తున్నాడని విమర్శించారు. కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడని చెప్పారు. అదే వ్యక్తి సలహాల కోసం నేడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలి. తాను సీఎం కుర్చీ ఎక్కాలి. ఇదే బాబుకు తెలిసింది. అందుకోసం ఎంతకైనా దిగజారుతారు. ఎన్ని మాటలైనా చెబుతారు.