2024 సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక అసెంబ్లీ నియోజవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పోటీ చేస్తున్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా గాజువాక అసెంబ్లీ నియోజవర్గంలో ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశాఖ ఒక్క కంటే నాకు పదవి ముఖ్యం కాదు, విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరణ చేయబోమని భారత ప్రధాని నరేంద్ర మోడీ అనకాపల్లి తన ఎన్నికల ప్రచారంలో ప్రకటిస్తే తాను ఎన్నికల నుంచి తప్పుకుంటానని తెలిపారు.
కాగా ఈ నెల 6వ తేది సాయంత్రం అనకాపల్లిలో మోడీ బహిరంగ సభ ఉండటంతో గుడివాడ అమర్నాథ్ మాటలకి ప్రాధాన్యత సంతరించుకుంది. మరో రెండు రోజుల్లో మోడీ అనకాపల్లి పర్యటనకి వస్తున్న సందర్భంలో.. ఆ బహిరంగ సభలో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ చేయబోమని మోడీ ప్రకటించిన మరుక్షణం నుంచే నేను గాజువాకలో ప్రచారం ఆపేస్తానని, అవసరమైతే పోటీలో ఉన్న ఇతర పార్టీల నాయకుల్ని పోటీ నుంచి తప్పుకోమని కోరి ఆ సీట్ ని కూటమికి ఇస్తామని ఈ సందర్భంగా తెలిపారు. మాకు పదవులు ముఖ్యం కాదు అని, మా తాత గారి కాలం నుంచి శాసనసభ్యులుగా కొనసాగుతున్నామని ఇంతకన్నా జీవితంలో చూడడానికి ఏమీ లేదని, రాష్ట్రానికి మేలు జరుగుతుందంటే తృణప్రాయంగా గాజువాక సీట్ ను త్యాగం చేస్తానని ప్రకటించాడు.