రాష్ట్రంలో విద్యాసంస్థల యజమానులు చాలామంది రాజకీయాల్లో ఉన్నారు. ఎన్నికల్లోనూ పోటీ చేస్తుంటారు. చాలామంది రెండింటిని ముడిపెట్టరు. కానీ నెల్లూరు సిటీ తెలుగుదేశం అభ్యర్థి పొంగూరు నారాయణ మాత్రం అలా కాదు. తన స్వార్థం కోసం ఎడ్యుకేషనల్ సంస్థ సిబ్బందిని వాడుకుంటూనే ఉన్నారు. 2014లో నమ్మకస్తులను చంద్రబాబు నాయుడి కోసం పనిచేయించారు. టీడీపీ అధికారంలోకి రావడంతో గిఫ్ట్ కింద ఆయనకు మంత్రి పదవి దక్కింది. 2019కి వచ్చేసరికి నెల్లూరు సిటీ నుంచి నారాయణ బరిలో నిలిచారు. ఆ సమయంలో తన స్కూళ్లు, కాలేజీల సిబ్బందిని తెగ వాడేశారు. ప్రచారానికి పంపారు. ఓటర్ల వివరాల సేకరణకు వినియోగించుకున్నారు. చివరికి ప్రలోభపెట్టేందుకు వారిని క్షేత్రస్థాయికి పంపించారు. చాలామంది డబ్బు పంపిణీ చేస్తూ దొరికిపోయిన సందర్భాలున్నాయి
2024 ఎన్నికలు వచ్చాయి. నారాయణ తన బుద్ధి మాత్రం మార్చుకోలేదు. గతం కంటే అధికంగా ఆయన విద్యాసంస్థల సిబ్బంది ఈసారి టీడీపీ కోసం ఎన్నికల్లో పనిచేస్తున్నారు. నెల్లూరు సిటీ చేరికలు, క్యాంపెయిన్, డబ్బు తదితర వ్యవహారాలను పాఠశాలలు, కాలేజీలకు చెందిన ముఖ్యులే పర్యవేక్షిస్తున్నారు. సత్యనారాయణపురం వినాయక స్వామి ఆలయ మాజీ చైర్మన్ గౌరాబత్తిన సుబ్బారావు టీడీపీలో చేరారు. ఆ ప్రాంతంలోని గుడిలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి సాక్షాత్తు నారాయణ విద్యాసంస్థల జీఎం విజయభాస్కర్‌రెడ్డి హాజరై టీడీపీ కండువాలు కప్పారు. వాస్తవానికి ఆలయాల్లో రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకూడదు. కానీ ఆ విషయాన్ని పట్టించుకోకుండా గుడి ప్రాంగణంలో చేరికల కార్యక్రమం జరిపి బరితెగించి వ్యవహరించారు. అలాగే నిత్యం స్కూళ్లు, కాలేజీల వ్యవహారాలు చూసుకునే విజయభాస్కర్‌రెడ్డి ఇలా రాజకీయాలు చేయడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన నారాయణ తన రాజకీయ స్వార్థం కోసం విద్యాసంస్థలు, సిబ్బందిని వాడుకుంటున్నారు.