ఉత్కంఠభరితంగా సాగిన సార్వత్రిక ఎన్నికల సమరం నిన్నటి రోజుతో ముగియడంతో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తమ పార్టీకి రానున్న మెజారిటీపై ఆరా తీసే పనిలో నిమగ్నమైంది. మొదటి నుండి 175కి 175 అసెంబ్లీ, 25 కి 25 పార్లమెంట్ సెగ్మెంట్లలో గెలవడమే టార్గెట్ గా పెట్టుకుని ఎన్నికలకి వెళ్ళిన జగన్ ఆ మేరకు వచ్చే ఫలితాలపై ఆరా తీస్తునట్టు సమాచారం. పులివెందులలో ఓటు వేసి తాడేపల్లి నివాసానికి చేరుకున్న జగన్ పార్టీలో ముఖ్యులతో అంతర్గత సమావేశం జరిపి ఏ మేరకు ఓటర్లు తమ పార్టీకి మద్దతు పలికారో లెక్కలు వేస్తున్నారు.
రాష్ట్రంలో భారీగా పోలింగ్ జరిగిన నేపథ్యంలో అందులోను మహిళలు , వృద్దులు పోలింగ్ బూతుల దగ్గర భారీగా బారులు తీయడంతో ఈ ట్రెండ్ తమ పార్టీకే సానుకూలం అనే లెక్కలు అధికార పార్టీ వేసుకుంటుంది. గడచిన 5ఏళ్లలో మహిళలకు ఠంచనుగా అందించిన సంక్షేమ పథకాలు వలన పార్టీ పట్ల మహిళల్లో పూర్తి విశ్వాసం గెలుచుకున్నామని దాని ఫలితమే వారు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గోని పూర్తి స్థాయిలో మద్దతు పలికారనే అంచనాకి వైసీపీ పెద్దలు వస్తున్నారు. అలాగే సామాజిక సమీకరణాలు కూడా పూర్తిస్థాయిలో పనిచేశాయనే వాదనా వినిపిస్తుంది. జగన్ మొదటి నుండి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ వారికి వేసిన పెద్ద పీట ఈ ఎన్నికల్లో సత్ఫలితాలను అందించాయనే మాట వినిపిస్తుంది.
ఏది ఏమైనా తమ గెలుపు తథ్యమని , మెజారీటీ కూడా భారీగానే ఉంటుందని , 5ఏళ్ళ పరిపాలనతో బడుగు బలహీన వర్గాల మనసులని గెలుచుకున్నామని దాని ఫలితం రేపటి రోజున అంచనాలకు మించి రాబోతున్నట్టు అధికార పార్టీ ఆఫ్ ధ రికార్డ్ చెబుతున్న మాట. అధికార పార్టీ చెబుతున్న మేరకు ఫలితాలు రాబోతున్నాయా లేదా అనేది తేలుసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి కొద్దిరోజులు వేచి చూడక తప్పదు.