రాష్ట్రంలో ఉత్కంఠ భరితంగా సాగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారం చేపట్టబోయే పార్టీ ఏదని ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్న తరుణంలో అధికారం మళ్ళీ మాదే అని ఢంకా భజాయించి మరీ చెబుతుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. గతంలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నమోదైన పోలింగ్ శాతం పూర్తిగా తమకే లాభం చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఈ నేపథ్యంలో జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు ఇప్పటికే ఆ పార్టీ పెద్దలు ప్రకటిస్తూ వస్తున్నారు. జూన్ 9వ తారీఖున విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు
ఇదిలా ఉంటే ఆ పార్టీ మరో సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు, ఉత్తరాంధ్రా జిల్లాల కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి విశాఖలో మాట్లాడుతూ జగన్ ప్రమణ స్వీకారానికి ముహూర్తంకూడా ఫిక్స్ చేసినట్టు ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాట ప్రకారం 9వ తేదీన ఉదయం 9.38కి విశాఖలో ప్రమాణ స్వీకారం జరుగుతుందని దీనికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని విశాఖకు వచ్చిన ఆయన తెలిపారు. ఈసారి ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందించే కార్యక్రమం వల్ల మహిళలు వృద్దులు ఎస్సీ, బీసీ, బడుగు బలహీన వర్గాలుచూపిన కృతజ్ఞత వల్లే మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్తబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 13న జరిగిన పోలింగ్ సరళి, ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఓటింగ్ జరిగిన తీరు చూసినట్లయితే 4వ తేదీనే వార్ వన్ సైడ్ ఓటింగ్ కు నిదర్శనమన్నారు.