జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి పదేళ్ళయింది. ఈ పదేళ్లలో పవన్ ఏం చేసాడు? పార్టీని సంస్థాగతంగా ఎందుకు బలపర్చలేకపోయాడు? పవన్ మాటలకూ నిర్ణయాలకు ఎందుకు పొంతన ఉండటం లేదు? తనకంటూ స్థిరమైన ఆలోచనలు ఎందుకుండవు? స్పష్టమైన నిర్ణయాలను ఎందుకు తీసుకోలేకపోతున్నాడనే ప్రశ్నలు జనసేన కార్యకర్తల్లోనే కాదు సామాన్య ప్రజల్లో కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పవన్ సామాజికంగా కాపు వర్గానికి చెందిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్లో రెడ్లు, కమ్మల తర్వాత మూడవ బలమైన వర్గంగా పేరొందిన ఈ వర్గంలో రాజ్యాధికారాన్ని అందుకోవాలనే కోరిక బలంగా ఉంది. అయినప్పటికీ రాజకీయాధికారం తమకు లేకుండా పోయిందని, దానిని అందు కోవాలనే కోరిక వారిలో బలంగా ఎప్పటి నుంచో ఉంది. కానీ సరైన నాయకుడు లేక కాపు వర్గం ఆశలు నెరవేరలేదు. గతంలో పి. శివశంకర్, చిరంజీవి లాంటి వాళ్ళ వల్ల కాపు వర్గంలో ఆశలు చిగురించినా నెరవేరలేదు. ఈ దశలో పవన్ పార్టీ పెట్టడం, ఆవేశంగా ప్రసంగాలు ఇవ్వడంతో వారిలో కాస్త ఉత్సాహం వచ్చింది. కానీ పవన్ లో సరైన పరిణతిగానీ, దార్శనికత కానీ లేవని కాపు వర్గానికి అర్ధం కావడానికి ఎంతో సమయం పట్టలేదు.
పవన్ కళ్యాణ్ రాష్ట్ర విభజన కారణంగా పదకొండు రోజులు అన్నం తినడం మానేసానని ప్రకటించారు. కానీ రాష్ట్ర విభజన విషయంలో డబుల్ గేమ్ ఆడిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును 2014 ఎన్నికలలో బలపరిచారు. ఆ ఎన్నికల్లో రాష్ట్ర విభజనను బలపరిచిన బీజేపీతో పొత్తులో ఉన్న చంద్రబాబు వెంట నడిచారు. 2019 ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నారు. 2019 ఎన్నికల్లో తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓటమి పాలయ్యారు. అయిదేళ్లలో తన సిద్ధాంతాలేమిటో చెప్పకపోవడంతో కాపు సామాజిక వర్గానికి కంచుకోటలైన జిల్లాల్లోనూ సత్తా చాటడంలో విఫలమయ్యారు. కానీ ఆ ఓటమి నుండి పాఠాలను మాత్రం పవన్ నేర్చుకోలేదు.
ఒక పార్టీని సీరియస్గా నడిపే ఆలోచన, దక్షత, స్థిరత్వం లేకపోవడం ఆయనలో ఉన్న ప్రధాన లోపంగా చెప్పుకోవచ్చు. తన ప్రసంగాలను సినిమాటిక్ గా చెప్పడం, ఊగిపోతుండడం, ఒక మాట చెప్పిన తరువాత దానికి కొనసాగింపు లేకుండా వేరే వాటిపై ద్రుష్టి పెట్టడం పవన్ కి ప్రధాన అడ్డంకిగా మారింది. ఆయనకు పార్టీని నడిపే దార్శనికత, సమర్థత ఉన్నట్లు ప్రజలకు కనిపించకపోవడంతో ప్రజలు ఆయనను నమ్మే పరిస్థితిలో లేరు. దాంతో పాటు తన పార్టీ కార్యకర్తలను, తనను నమ్మిన నేతలను బకరాలను చేయడం కూడా ఆయన పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లడానికి కారణమైంది. ముందుగా ముఖ్యమంత్రి పదవి అంటూ మాట్లాడి, తర్వాత 50–60 స్థానాలలో పోటీ అని ప్రగల్భాలు పలికి, చివరకు 21 సీట్లకు పరిమితం కావటంతో సొంత పార్టీ నేతలే పవన్ ని నమ్మలేని పరిస్థితి తలెత్తింది. ఈ ఎన్నికల్లో కనుక పవన్ సత్తా చాటకపోతే పూర్తిగా రాజకీయాలకు దూరం కావడం మంచిదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.