ఈ ప్రపంచ పటం మీద ఎన్ని దేశాలుంటాయని మీ అంచనా? చిన్నా చితకా దేశాలన్నీ కలిపి ఒక మూడొందల దేశాలుంటాయేమో అనుకుంటున్నారా? కానే కాదు..
ఈ రోజు గూగుల్ ప్రకారం ప్రపంచంలో 195 దేశాలున్నాయి. ఈ దేశాల్లో మిగతా దేశాలతో పెద్దగా సంబంధం లేకుండా బతికేవి కొన్ని అయితే, అందరికీ తెలిసిన పేర్లు ఒక 70 లేక 80 ఉండొచ్చు. వీటిలో ప్రపంచ రాజకీయాలు కూడా తెలీని వాళ్ళు కోట్ల మంది ఉంటారు. కొన్ని దేశాల ప్రజలకు వాళ్ళ దేశంలో ఏం జరుగుతుందో కూడా తెలీదు. తిండి బట్ట కోసం నిరంతరం శ్రమించి, పొట్ట పోసుకోడానికే జీవితాలు చెల్లి పోతాయి
అయితే మన బాబు గారికి ఇవన్నీ పట్టవు. ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయో తెలీదు. ఆ దేశాల ప్రజల వ్యాపకాలేంటో అంతకంటే తెలీదు. ప్రపంచంలోని దేశాలూ, వాటి ప్రజలూ తనకు మద్దతు ఇవ్వడానికే పుట్టారని భావిస్తుంటారు.
గతంలో అమరావతి విషయంలో ప్రపంచంలోని 200 దేశాలు తనకు మద్దతిచ్చాయని చెప్పారు. గట్టిగా మన తెలుగు రాష్ట్రాలు దాటి నాలుగడుగులు ముందుకు పోతే అమరావతి గొడవేమిటో మన దేశంలోనే ఎవరికీ తెలియదు. ఏ రాష్ట్రం రాజకీయాలు ఆ రాష్ట్రానికి ఉన్నాయి.
ఇక ఇప్పుడేమో ఎక్కడెక్కడి దేశాలూ తనకు మద్దతుగా నిలిచాయని చెప్పుకుంటున్నారు. మొన్నటికి మొన్న బెయిల్ మీద జైల్లోనుండి బయటికి వచ్చాక, 62 దేశాల ప్రజలు తనకు మద్దతు ఇచ్చారని చెప్పారు. ఇప్పుడేమో తనకు వచ్చిన కష్టం (ఇంతకే ఆ కష్టమేంటో? అధికారం లేకపోవడమేనేమో?) చూసి 62 దేశాల ప్రజలు తనకు మద్దతుగా నిలిచారని, తను చేసిన అభివృద్ధి పనులను వాళ్ళు ఇంకా గుర్తు చేసుకుంటున్నారని మతి భ్రమణ మాటలు మాట్లాడుతున్నారు
అయ్యా, తమరు నిర్మించారని చెప్పుకుంటున్న హైటెక్ సిటీలోనే తమ పేరు ఎవరూ తలవట్లేదు.హైదరాబాద్ లో అభివృద్ధి ఎప్పుడూ ఉందని తెలంగాణ ప్రజలు అంటున్నారు. మీరు చేసిన అభివృద్ధి పనులేవైనా ఉంటే, అవి ఇక్కడి జనానికే గుర్తు లేదు. అలాటిది 80 దేశాల ప్రజలు తాను చేసిన పనులను గుర్తు ఉంచుకుని మద్దతిస్తున్నారా? ఆ దేశాల పేర్లేంటో మీరు చెప్తే బాగుంటుంది. కనీసం ఇన్ని దేశాలున్నాయని తెలుసుకుంటాం.
ఇంతకీ తాము మద్దతు ఇస్తున్న సంగతి ఆ దేశాలకూ వాటి ప్రజలకు తెల్సా? లేక మీకు వస్తున్న కలల్లో ఇలా జరుగుతోందా? ఆ దేశాలేమిటో, వాళ్ళెవరో ప్రజలకు కూడా చెప్తే సంతోషిస్తారు. వాళ్ళు మద్దతిస్తున్న సంగతి వాళ్ళకే తెలియక పోయినా, మీకు మాత్రం టెలీపతీ ద్వారా గాల్లోంచి తెలిసి పోతున్నట్లుందే? ప్రజలు పట్టించుకోరు కదా, అడగరు కదా అని “తగ్గేదే లే” అని మీరు నోటికొచ్చిన సంఖ్య చెప్పేసి “ఆ దేశాల వాళ్ళు నాకు మద్దతు గా నిలిచారు” అంటే జనం నోటితో నవ్వరు. మీరు గొప్పతనం అనుకుంటున్నది పిచ్చితనం అని జనానికి తెలిసింది గానీ మీకు మాత్రం తెలియట్లేదు.