రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో 11 రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ రాష్ట్రమంతటా రాజుకుంది. కాగా ప్రస్తుతం పెన్షన్ చుట్టూనే ఆంధ్రప్రదేశ్ రాజకీయం నడుస్తుంది. టీడీపీకి లబ్ది చేకూర్చేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసిన పిటిషన్ కారణంగా వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో గత నెలలో ఒకటో తేదీన లబ్ధిదారుల ఇంటికి చేరాల్సిన పెన్షన్ ఆగిపోవడంతో సచివాలయాల ద్వారా పెన్షన్ పంపిణీ చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం.
తాము ఎండల్లో నిలబడటానికి కారణం టీడీపీనే అని మెజారిటీ లబ్ధిదారులు భావించడంతో టీడీపీ దిద్దుబాటు చర్యలకు పూనుకుని ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నం చేసినా అప్పటికే ముప్పై మందికి పైగా లబ్ధిదారులు చనిపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు తీరును దుయ్యబడుతూ పలువురు లబ్ధిదారులు తీవ్రంగా విమర్శించారు. దీంతో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డీబీటీ పద్దతిలో పెన్షన్ పంపిణీ చేయాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డీబీటీ పద్దతిలో పెన్షన్లను జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. బ్యాంకు ఖాతాలు లేని మిగిలిన లబ్దిదారులకు ఇంటివద్దకు పెన్షన్ల పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టింది.
కాగా బ్యాంకు ఖాతాల్లో పెన్షన్లు వేయడం కారణంగా ఇప్పుడు వృద్దులకు కొత్త చిక్కులు మొదలయ్యాయి. పెన్షన్ లబ్ధిదారుల్లో మెజారిటీ లబ్ధిదారులకు బ్యాంకులలో సరైన బ్యాలెన్స్ మైంటైన్ చేయని కారణంగాప్రభుత్వం వేసిన పెన్షన్ డబ్బులు కట్ చేసుకుంటున్నట్లు లబ్దిదారులకు మెసేజులు వస్తున్నాయి. దాంతో పాటు వృద్దులకు స్మార్ట్ ఫోనులు లేకపోవడం, జీ పే, ఫోన్ పే లాంటి యాప్స్ వాడకం తెలియకపోవడం వల్ల పెన్షన్ డబ్బుల కోసం బ్యాంకులు ఏటీఎంల చుట్టూ తిరగాల్సి వస్తుంది. గత నెల దగ్గరగా ఉన్న సచివాలయాలు దగ్గరకు వెళ్తే సరిపోయేది. కానీ టీడీపీ వేయించిన పిటిషన్ల కారణంగా ఇప్పుడు తమ ఊరికి 30-40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణాలకు వెళ్లాల్సిన దుస్థితి లబ్దిదారులకు రావడం గమనార్హం.
ఇదిలా ఉంటే కొందరు లబ్దిదారులకు రెండు మూడు బ్యాంకు ఖాతాలు ఉన్న కారణంగా ఏ బ్యాంకు ఖాతాలో పెన్షన్ డబ్బులు పడ్డాయో తెలియక లబ్దిదారులు అయోమయానికి గురవుతున్నారు. నాన్ మైంటైన్ బ్యాంకు ఖాతాల్లో పడటం వల్ల చార్జీల పేరుతో సుమారు 1000 రూపాయల వరకూ బ్యాంకులు కట్ చేసుకోవడంతో లబ్దిదారులకు పూర్తి పెన్షన్ దక్కే అవకాశం లేదు. టీడీపీ ప్రోద్భలంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసిన పిటిషన్లే దీనికంతటికి కారణమని టీడీపీకి ఎన్నికల్లో ఓటు ద్వారా గట్టిగ బుద్ది చెప్తామని పెన్షన్ లబ్ధిదారులు బహిరంగానే వ్యాఖ్యానిస్తూ ఉండటం గమనార్హం.