త్యాగాల త్యాగరాజు యజమాని పట్ల తన చిత్తశుద్ధిని మరోసారి చాటుకున్నారు. కూటమిలో భాగంగా నిడదవోలు అభ్యర్థిగా కందుల దుర్గేశ్‌ను బరిలోకి దింపనున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మొదటినుండీ తన పార్టీ ప్రయోజనాల కంటే తెలుగుదేశం ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్ తాజాగా తన అభ్యర్థి కందుల దుర్గేశ్ ఆశించిన సీటును తెలుగుదేశానికి త్యాగం చేసి చంద్రబాబు పట్ల తన విధేయతను ప్రజలందరికీ చాటి చెప్పాడు.
వాస్తవానికి జనసేన టీడీపీ కూటమిలో భాగంగా రాజమండ్రి రూరల్ సీటును కందుల దుర్గేశ్ ఆశించారు. ఈ సీటును కందుల దుర్గేశ్ కు తప్పకుండ కేటాయిస్తామని పవన్ కళ్యాణ్ హామీ కూడా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా రాజమండ్రి రూరల్ సీటును ఆశించడంతో సీటును ఎవరికి కేటాయిస్తారన్న ఉత్కంఠ పలువురిలో నెలకొంది. ఇరు పార్టీల నాయకులు సీటు తమదే అని భావిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ కందుల దుర్గేశ్ ని రాజమండ్రి రూరల్ సీటును త్యాగం చేసి పక్కనే ఉన్న నిడదవోలు సీటులో పోటీ చేయమని చెప్పడంతో కందుల దుర్గేశ్ పవన్ నిర్ణయంపై గుర్రుగా ఉన్నారని వార్తలు కూడా వచ్చాయి. కానీ చివరకు కందుల దుర్గేశ్ నిడదవోలు నుండి పోటీ చేయనున్నారని నేడు జనసేన అధికారికంగా ప్రకటించడంతో టీడీపీకి లబ్ది చేకూర్చడానికి జనసేన పార్టీని నమ్ముకున్న నేతలను పవన్ కళ్యాణ్ నట్టేట ముంచుతున్నారన్న ఆరోపణలకు బలం చేకూరినట్లైంది.
జనసేన ఆశావహులతో ఆడుకుంటున్న పవన్
జనసేన టీడీపీ కూటమిలో భాగంగా రెండు వారాల క్రితం ఐదు సీట్లను ప్రకటించిన పవన్ కళ్యాణ్ మరో రెండు రోజుల్లో అన్ని సీట్లలో అభ్యర్థులను ప్రకటిస్తానంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించకుండా తాత్సారం చేయడం ఈ లోగ కూటమి పొత్తులో బీజేపీ కూడా జాయిన్ కావడంతో తమ సీట్లను కూడా ఎక్కడ త్యాగం చేస్తాడో అన్న అనుమానంతో జనసేన నుండి సీట్లు ఆశిస్తున్న ఆశావహుల్లో నిరాశ నిస్పృహలు అలుముకుంటున్నాయి.
జనసేన ప్రచారం మొదలుపెట్టిన తొలినాళ్లలో తణుకు నియోజకవర్గం నుండి విడివాడ రామచంద్రరావును ఎమ్మెల్యేగా గెలిపించాలని బహిరంగంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. కానీ తణుకు సీటును ఆరిమిల్లి రాధాకృష్ణకు త్యాగం చేయడంతో తణుకు సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న విడివాడ రామచంద్రరావుకు నిరాశ తప్పలేదు. ఈ విషయంపై బహిరంగంగానే విడివాడ రామచంద్రరావు విమర్శలు చేయడం తెలిసిన విషయమే.
కాగా అభ్యర్థుల ప్రకటనలో తాత్సారం చేయడం గెలిచే సీట్లను టీడీపీకి వదిలేసి ఓడిపోయే అవకాశాలున్న సీట్లను తన పార్టీ కోసం కేటాయించడం చూస్తుంటే పవన్ కళ్యాణ్ తన పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసమే పార్టీ నడుపుతున్నారని సామాన్యులతో పాటు జన సైనికులలో కూడా సందేహం కలుగుతుంది. ఇకనైనా అభ్యర్థులను ప్రకటిస్తే గ్రౌండ్ లెవెల్ లో ప్రజలకు చేరువ కాగలమని జనసేన నుండి సీట్లను ఆశిస్తున్న అభ్యర్థులు కోరుకుంటుంటే పవన్ కళ్యాణ్ నుండి మాత్రం ఎలాంటి స్పందన ఉండటం లేదు. ఇలాగే పార్టీని నడిపితే జనసేన సంస్థాగతంగా ఎదగడం కష్టం అని ఆ పార్టీ నేతలే సన్నిహితుల దగ్గర వాపోతున్నారు. మరి పవన్ ఇకనైనా మేలుకుంటారేమో చూడాలి..