నాయకుడు అనేవాడు ముఖ్యంగా రాజకీయాల్లో తనకంటూ ఒక నిర్దిష్టమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. తన అడుగులు తన అభిమానులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ మార్గదర్శకంగా నిలవాలి. నాయకుడి ఆలోచనలు అడుగులు అర్థవంతంగా ఉన్నప్పుడే అభిమానులు కార్యకర్తల ఆలోచనా విధానం మారుతుంది. అనుకున్న లక్ష్యానికి చేరటానికి అవకాశం దొరుకుతుంది. అలా కాకుండా చిత్తశుద్ధి లేని శివ పూజలు ఏల అన్నట్టు.. అవగాహన లేని మాటలు, బాధ్యతతో వేయని అడుగులు ఎప్పటికీ గమ్యాన్ని చేర్చలేవు అనడానికి పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితమే ఒక ఉదాహరణ.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్లు గడుస్తుంది, జనసేన పార్టీ స్థాపించి పదేళ్లు ముగుస్తుంది. తనకంటూ ఒక బలమైన కేడర్ కానీ, కార్యవర్గం గానీ, పూర్తిస్థాయిలో పార్టీ నిర్మాణం చేయలేకపోయిన పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ఏమనాలి? ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్లు ఎక్కడికెళితే అక్కడ పుట్టాను అనటం, సమయం సందర్భం లేకుండా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడటం, పొంతన లేని వ్యాఖ్యలతో అభిమానులను కన్ఫ్యూజ్ చేయడం తప్పితే పదేళ్లలో పవన్ కళ్యాణ్ సాధించినది ఏదైనా ఉంది అంటే అది కేవలం వెకిలితనం వెర్రి చేష్టలు మాత్రమే…
ఏదో సినిమాలో బాలయ్య చెప్పినట్టు నవ్వకండి సీరియస్ మేటర్… డైలాగులా పవన్ తన మాటలతో ఈరోజు తెనాలిలో కామెడీ చేశాడు. నాకోసం ఏనాడూ దేవుడిని కోరికలు కోరని నేను రెండు కోరికలు కోరుకున్నాను అది కూడా అభిమానుల కోసమే అంటూ హాస్యాన్ని పండించాడు. దేవుడా ఒక్క హిట్ సినిమా ఇవ్వు అని, దేవుడా… నన్ను ఒక్కసారి గెలిపించి అసెంబ్లీకి పంపు అని దేవుడిని కోరుకున్నాడట… అదికూడా కేవలం తన అభిమానులకోసమేనట! సినీ హీరోగా కథలు ఎంచుకోవడంలో నీ అవగాహనాలోపం, రాజకీయ నాయకుడిగా సక్రమంగా పడని అడుగులు, క్యాడర్ ని నిర్మించుకోలేని నాయకత్వ లోపం నీ దగ్గర పెట్టుకుని దేవుని మొక్కుకుంటే హిట్ వస్తుందా?
నీ పార్టీ సిద్ధాంతాలు పక్కనపెట్టి సరైన నాయకత్వ లక్షణాలు లేకుండా చంద్రబాబు చెప్పులు మోతకే పరిమితమైతే ఎమ్మెల్యేగా గెలుపొస్తుందా? నిజంగా నీ అడుగుల్లో నిజాయితీ ఉంటే గత 2019 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తున్న తనని కనీసం ఒకచోట కూడా గెలిపించకుండా పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఎందుకు ఓడించారు అని పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఆలోచించగలిగితే ఈ రకమైనటువంటి మాటలు వచ్చేవి కాదు. ఈ మాటలు వింటుంటే పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం నవ్వుతున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత సీరియస్ మేటరో.. ఎందుకు నవ్వకూడదో…