‘పిఠాపురం నియోజకవర్గం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శాశ్వత నివాసం. ఇక్కడ సొంతింటిని నిర్మించే పనిలో ఉన్నారు. శాసనసభ సమావేశాలు, కేంద్ర పర్యటనలు, పార్టీ కార్యకలాపాలు, సమావేశాల కోసం మినహా మిగిలిన సమయమంతా నియోజకవర్గంలోని ఇంట్లో అందుబాటులో ఉంటారు’ అని ఆయన సోదరుడు, సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు వ్యాఖ్యానించారు. పిఠాపురం మండలం కుమారపురంలో ఈ మాటలన్నారు. సేనానిని గొప్ప వ్యక్తిగా చిత్రీకరించేందుకు అటు చిరంజీవి.. ఇటు నాగబాబు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. కానీ అసలు వ్యక్తి చేసే పనులు మాత్రం వేరేగా ఉంటాయి.
గతంలో పవన్.. మంగళగిరిలో ఇల్లు కట్టుకున్నా. ఇక్కడే నా నివాసమని డబ్బా కొట్టుకున్నాడు. తీరా చూస్తే సినిమా షూటింగ్‌లు చేసుకుంటూ హైదరాబాద్‌లోనే ఎక్కువ కాలం గడిపాడు. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో పోటీ చేశాడు. నేను ఈ ఊరిలోనే స్థిర నివాసం ఉంటాను. మిమ్మల్ని వదిలిపోననని రెండుచోట్ల చెప్పాడు. ఇతనికే క్లారిటీ లేదని ప్రజలు ఓడగట్టి పంపేశారు. తర్వాత ఏపీకి టూరిస్ట్‌గా మారాడు. అడపాదడపా నియోజకవర్గాల్లో మీటింగ్‌లు పెట్టి నాకు ఈ ప్రాంతమంటే చాలా ఇష్టమని, అవకాశం దొరికితే ఇక్కడే ఉండిపోతానని బిల్డప్ ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
ఇప్పుడు పిఠాపురం తన శాశ్వత నివాసమని పవన్ చెబుతున్నాడు. ఆయన వర్గీయులు అదే ప్రచారం చేస్తున్నారు. మరి 2019లో గాజువాక, భీమవరం ప్రజలకు చెప్పింది అబద్ధాలే కదా.. మరోచోట అయితే ఓడిపోతానని, పిఠాపురంలో తన సామాజికవర్గ ఓట్లు అధికంగా ఉన్నాయి కాబట్టి గెలవచ్చనే ఆశతో సేనానికి ఇక్కడికి వచ్చాడు. తాత్కాలికంగా అద్దె ఇల్లు తీసుకున్నాడు. ఈయన ఇక్కడుండడని, హైదరాబాద్ వాసి అని ప్రజలు భావిస్తున్న తరుణంలో వారిని మభ్యపెట్టడానికి నాగబాబు ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ నమ్మే పరిస్థితి లేదు. పిఠాపురం శాశ్వత నివాసమని చెబుతున్నారు కదా ఇంతకీ ఓటు ఇక్కడే ఉందా.. లేదా మంగళగిరిలోనే ఉంచేశారా.. ఈ ఎన్నికల వరకే పిఠాపురం అనే పేరు పవన్‌కు గుర్తుంటుంది. ఓడినా.. జనం టైం బాగోలేక గెలిచినా ఇక్కడ అసలు ఉండడు. సినిమాలు చేతిలో ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ మాత్రమే ఆయన శాశ్వత నివాసం. ఇదే నిజం.
ప్రజల చెవుల్లో పూలు పెట్టాలంటే మెగ్రా బ్రదర్స్ తర్వాతే ఎవరైనా.. ఆ మధ్యే పవన్ హైదరాబాద్‌లో ఖరీదైన ప్రాంతాల్లో రూ.కోట్లు పెట్టి ఇల్లు కొనుగోలు చేశాడని ప్రచారం జరిగింది. సారు ఇంతకీ ఏ ఇంట్లో ఉంటారోనని అభిమానులే ప్రశ్నిస్తున్నారు. పిఠాపురంలో స్థలం చూశాం, ఇల్లు కట్టేస్తామని నాగబాబు చెప్పగానే కరకట్ట నివాసంలో భోజనం చేస్తున్న చంద్రబాబు నాయుడికి పొర పోయిందంట. అన్నదమ్ములు మళ్లీ మన చేతి చమురు వదిలించేలా ఉన్నారని లోకేశ్‌తో వాపోయాట.