ప్రతీ జనసైనికుడు తలెత్తుకునే విధంగా మూడొంతుల సీట్లకు తగ్గకుండా పోటీ చేస్తున్నాం.. – ఆనందంలో జన సైనికులు..
పొత్తులో ఉన్నప్పుడు నాకు తెలియకుండా పొత్తు ధర్మం పాటించకుండా రెండు సీట్లు ప్రకటించారు. అందుకు ప్రతిగా నేనూ రెండు సీట్లను ప్రకటిస్తున్నా.. – ఆవేశంలో జన సైనికులు
నాకు మీరు ఓట్లు వేసి గెలిపించి ఉంటే ఎక్కువ సీట్లను అడిగేవాడిని. కానీ మీరే నాకా అవకాశం ఇవ్వలేదు. అందుకే 24 సీట్లకు పరిమితం కావాల్సివచ్చింది.. – ఆలోచనలో జన సైనికులు
24 సీట్లేనా అని మనల్ని ఎగతాళి చేస్తున్నారు. విశ్వామిత్రుడు బ్రహ్మపథానికి వెళ్ళడానికి కూడా 24 తోనే.. గాయత్రీ మంత్రం 24 అక్షరాలే.. ఈ 24 తో జగన్ ని అథఃపాతాళానికి తొక్కేస్తా.. – అసంతృప్తితో జన సైనికులు..
బీజేపీతో పొత్తులో భాగంగా మూడు అసెంబ్లీ సీట్లను, ఒక ఎంపీ సీటును బీజేపీకి త్యాగం చేస్తున్నా.. – అయోమయంలో జన సైనికులు
ప్రపంచంలో ఇన్ని వేరియేషన్స్ ఉన్న పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కరేనేమో. మైక్ దొరికితే రెచ్చిపోవడం, రియాలిటీలో మాత్రం చతికిల పడటం పవన్ కే చెల్లింది. పర్వతం ఎవడికీ వంగి సలాం చేయదు అంటూనే చంద్రబాబుకు వంగి వంగి సలాం కొట్టడం పవన్ కళ్యాణ్ నైజం. చంద్రబాబుకు ఊడిగం చేయడానికి పార్టీ పెట్టాడని అందరూ విమర్శిస్తున్నా తన పంథా మార్చుకోకుండా టీడీపీ లబ్ది కోసం తన పార్టీ సీట్ల త్యాగానికి కూడా వెనుకాడకపోవడం ఆయనకే చెల్లింది. జనసేనను నమ్ముకున్న జనసైనికుల్లో, నాయకుల్లో కేడర్ లో ఉత్సాహం నింపడం మానేసి వారి ఆశలపై నీళ్లు చల్లడం, పార్టీ పెట్టి పదేళ్లయినా సంస్థాగతంగా పార్టీని బలపరచకపోవడం తన పార్టీ కార్యకర్తలకు వేరే పార్టీల జెండాలను మోయమని చెప్పడం, రాజకీయ నాయకులలో కేవలం పవన్ కు మాత్రమే ఉన్న అరుదైన రికార్డులుగా చెప్పొచ్చు.
తన చేతగాని తనంతో టీడీపీతో పొత్తులో భాగంగా 24 సీట్లకు పరిమితమైన జనసేనాని ఆ 24 సీట్లకు గాయత్రి మంత్రానికి ముడి పెట్టి సినీ తరహాలో గొప్పలు చెప్పుకున్న పవన్, ఆఖరికి ఆ సీట్ల సంఖ్యపై కూడా పట్టును కోల్పోయి మూడు సీట్లను బీజేపీకి త్యాగం చేశారు. ఇప్పుడు 21 సీట్లకు ఎందుకు పరిమితం అయ్యారన్న ప్రశ్న ఎదురవుతుందని, 21 పదాలున్న మంత్రాలను వెతకడానికి సినీ రచయితలను పురమాయిస్తారేమో. జనసేన తరపున మొదటినుండి విశ్వాసపాత్రంగా పనిచేస్తున్న నాయకులకు మొండి చేయి చూపిస్తూ, ఓడిపోయే అవకాశమున్న స్థానాలను తన పార్టీ అభ్యర్థులకు కేటాయిస్తున్నారన్న వాదనలు జనసైనికుల్లో మొదలయ్యాయి. రాజమండ్రి సీటును ఆశించిన కందుల దుర్గేష్ ను నిడదవోలుకు మార్చడం తణుకు సీటును ఆశించిన విడివాడ రామచంద్రరావుకు మొండి చెయ్యి చూపించడం పవన్ కే చెల్లింది.
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా జనసేన తరపున 21 సీట్లలో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉన్నారా లేదా అనే అనుమానాలు కూడా ప్రజల్లో మొదలవుతున్నాయి. మొదటి ఐదు స్థానాలను, ఆ స్థానాలలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన పవన్ కళ్యాణ్ మరో రెండు రోజుల్లో మిగిలిన అభ్యర్థులను ప్రకటిస్తానని చెప్పినా ఇప్పటివరకూ ఒక్క స్థానం మాత్రమే ప్రకటించి జనసేన ఆశావహులతో ఆడుకుంటున్నారు. పైగా ఆ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులే జనసేన అభ్యర్థులుగా పోటీ చేయనున్నారన్న అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. వాపును చూసి బలుపు అనుకుంటూ సభల్లో మాత్రమే ఎగిరెగిరి పడే పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా మాత్రం ఫెయిల్ అయ్యారని నిరభ్యంతరంగా చెప్పొచ్చు. ఇకనైనా పవన్ ఆలోచనల్లో మార్పు వచ్చి పార్టీని సరైన దారిలో నడిపించాలని జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారు.