‘సర్.. టీడీపీ వాళ్లు కొడుతున్నారు.. అవునా.. మీరు తగ్గి నా కోసం దెబ్బలు తినండి’
‘సర్.. తెలుగు తమ్ముళ్లు తిడుతున్నారు.. అవునా.. ఏం కాదు.. తిట్టించుకుని పక్కకు పోండి తప్ప ఒక్క మాట కూడా అనొద్దు. అది కూడా నా కోసమే..’
‘సర్.. తెలుగుదేశం నేతలు అవమానిస్తున్నారు.. ఏం మనుషులురా మీరు.. నా కోసం ఆ మాత్రం అవమానాలు ఎదుర్కోలేరా..’
ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసైనికుల మధ్య ఇదే నడుస్తోంది. చంద్రబాబుతో ఆయన పొత్తు పెట్టుకున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సేనను సమాన స్థాయిలో చూడకుండా చిన్నచూపు చూస్తున్నారు. మొన్న చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరులో జరిగిన రా కదలిరా సభలో చంద్రబాబు సమక్షంలో సేన కార్యకర్తల్ని టీడీపీ వారు చితక్కొట్టారు. నెల్లూరులో జరిగిన సభలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జనసేన జెండాలు తీసేయాలని తిట్టారు. ఇక టికెట్ల విషయానికొస్తే టీడీపీ నేతలు ప్రెస్మీట్లు పెట్టి మరీ సేనను అవమానిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పవన్ మాత్రం వారిని ఏమనవద్దని చెప్పడం జనసైనికులకు నచ్చడం లేదు.
తాజాగా ఓ సమావేశంలో పవన్ వ్యాఖ్యలు జనసైనికులకు కోపం తెప్పించాయి. ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ఈ దశలో భావోవ్వేగాలతో ఎవరూ మాట్లాడొద్దు. పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలు ప్రచారం చేయొద్దు. మీ అభిప్రాయం మాత్రం చెప్పండి. ఎవరైనా నా లైన్ దాటితే వివరణ తీసుకోండి. స్థూలంగా దీని అర్థం ఏంటంటే.. పొత్తులో జనసేన పాత్ర చాలా తక్కువ. సీట్లు కావాలంటూ ఎవరూ బయటికొచ్చి టీడీపీ నేతలపై మాట్లాడకూడదు. చంద్రబాబును సీఎం చేయడమే నా లక్ష్యం. పార్టీ లైన్ కూడా అదే. అందువల్ల పవనే సీఎం అని స్టేట్మెంట్లు ఇవ్వొద్దంటూ చెప్పకనే చెప్పారు. వాళ్లు ఎన్ని సీట్లు, ఎక్కడిచ్చినా తీసుకోవాలంతే గానీ టీడీపీని తిడితే సహించనని సొంత కార్యకర్తలకు పవన్ హితబోధ చేశాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా దీనికి రాష్ట్ర ప్రయోజనాలు, భవిష్యత్ అని పేరు పెట్టాడు గానీ, అసలు ఉద్దేశం మాత్రం తెలుగుదేశాన్ని జనసైనికులు ఏమీ అనకూడదు. తిట్టినా, కొట్టినా, అవమానించినా సర్దుకుపోవాలి. కాకపోతే ఈ విషయాన్ని నేరుగా చెబితే కార్యకర్తలు ఉమ్మేస్తారు కాబట్టి ఏవో సాకులు చెప్పాడు. హింట్లు ఇచ్చాడంతే. సేనాని తన ప్యాకేజీ కోసమే ఇదంతా చేస్తున్నాడని అర్థం చేసుకునే సమయానికి పార్టీని మరో ప్రజారాజ్యం చేసి ఉంటాడేమో..