2014 నుండి కాంగ్రెస్ పతనం మొదలైంది, 2029 నాటికి భారత్కు కాంగ్రెస్ నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుందని విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారు. పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన ఎంపీ విజయసాయిరెడ్డి కాంగ్రెస్ తీరుపై మండి పడ్డారు. ఆయనేమన్నారంటే
77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశాన్ని 50 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పాలించిందని కానీ దేశాన్ని అభివృద్ధి చేయలేదు. కురువృద్ధ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతున్న కాంగ్రెస్ పార్టీగా మారిపోయింది. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్కు 40 సీట్లు మాత్రమే వస్తాయి. 2029లో భారత్ నుండి కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగవుతుంది. ఆంధ్రప్రదేశ్ ను అశాస్త్రీయంగా విభజించిన తీరును ప్రజలు మర్చిపోలేదు. అప్పటినుండే కాంగ్రెస్ పతనం మొదలైంది. కుటుంబాలను చీల్చడం కాంగ్రెస్ పార్టీ నైజం. ఏపీ ప్రత్యేకహోదా విషయంలో చట్టం చేయకుండా నోటిమాటతో సరిపెట్టి తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
2029 ఎన్నికల తర్వాత కూడా తాను ఎంపీగానే ఉంటానని కానీ కాంగ్రెస్ తరపున ఒక్క ఎంపీ కూడా ఉండరని రాహుల్ గాంధీ దేశంలో ఎక్కడనుండి పోటీ చేసినా కూడా ఓడిపోతారని జోస్యం చెప్పిన విజయసాయిరెడ్డి తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.