వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి ఎవరూ ప్రస్తావించవద్దని కడప కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి తరచుగా షర్మిల, సునీత, చంద్రబాబు, లోకేష్, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ లు ప్రస్తావిస్తూ వస్తున్నారు. దీంతో వైసీపీ నేత సురేష్‌బాబు వైఎస్ వివేకా హత్య ప్రస్తావనపై కడప కోర్టును ఆశ్రయించారు. ప్రతివాదులుగా షర్మిల, సునీత, చంద్రబాబు, లోకేష్, పురందేశ్వరి, పవన్, రవీంద్రనాథ్‌రెడ్డిని చేర్చారు. కాగా పిటిషనర్ తరుపున న్యాయవాది నాగిరెడ్డి వాదనలు వినిపించగా వైఎస్ వివేకా హత్యపై ఏ ఒక్కరు మాట్లాడొద్దని కడప కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రస్తుతం వైఎస్ వివేకా హత్య కేసు ముడి సరుకుగా మారిపోయింది. ముఖ్యంగా షర్మిల, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వైఎస్ వివేకా కుమార్తె సునీత సీఎం జగన్, కడప ఎంపీ అవినాష్ పై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. దీంతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ వైఎస్ వివేకా హత్య ప్రస్తావనపై కడప కోర్టును వైసీపీ నేత సురేష్‌బాబు ఆశ్రయించడంతో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి షాక్ ఇచ్చింది. ఇప్పుడీ తీర్పు షర్మిల, సునీతలకు తీవ్ర షాక్ కలిగించిందనే చెప్పాలి. కడప ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిల వైఎస్ వివేకా హత్య ప్రస్తావనను తీసుకొస్తూ ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తుండగా, సునీత ఓ అడుగు ముందుకేసి స్లైడ్ షోల ద్వారా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. కాగా ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ ఒంటరిగా బరిలోకి దిగుతుండగా, బీజేపీ టీడీపీ జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి.