సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రముఖ సినిమా నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి ప్రశంసించారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను జగన్ అత్యున్నతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. నారాయణమూర్తి కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతిపరుడు. గతంలో అనేక మంది పాలనలో లోపాలను ఎత్తి చూపారు. ప్రజల సమస్యలపై సినిమాలు తీశారు. అలాంటి వ్యక్తి విద్యారంగంలో జగన్ తీసుకొచ్చిన సంస్కరణలపై తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చేపట్టిన ప్రజాదీవెన కార్యక్రమం శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలంలో జరిగింది. దీనికి విచ్చేసిన ఆర్.నారాయణమూర్తి తన ప్రసంగంలో వైఎస్సార్సీపీ పాలనలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. ప్రధానంగా జగన్ ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టడం ద్వారా గొప్ప పని చేశారని చెప్పారు. దీంతో ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ఉద్యోగాలు అవకాశాలు లభిస్తాయన్నారు. చదువంటే కేవలం సర్టిఫికెట్ కాదని, పిల్లల భవిష్యత్ కోసం ఉపయోగపడాలని జగన్ భావించారని కొనియాడారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఇంగ్లిష్ వస్తేనే ఉద్యోగాలు వస్తాయనేది నిజమన్నారు. తాను బీసీనని, రైతు బిడ్డనని, ఆరోజుల్లో చదువు కోసం ఎంత కష్టపడ్డానో వివరించారు. తెలుగు మీడియంలో చదువుకున్నానని, దీంతో ఉద్యోగం సంపాదించడంలో విఫలమైనట్లు ఆవేదన చెందారు. పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
ఇంగ్లిష్ మీడియం వల్ల పిల్లలు తెలుగుకు దూరమైపోతారని పెత్తందారులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇదంతా చంద్రబాబు డైరక్షన్లోనే జరుగుతోంది. నిజానికి వారికి తెలుగుపై ప్రేమ లేదు. ఉంటే తమ పిల్లలు, వారి పిల్లలను ఆ మీడియంలోనే చదివించేవారు. అయితే జగన్ చెప్పినట్లు పెత్తందారి పోకడలు అలవర్చుకుని నిరుపేదల పిల్లలను నాణ్యమైన విద్యకు, ఉద్యోగాలకు దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారికి నారాయణమూర్తి చెప్పిన నిజాలు మింగుడు పడవు.